సీసీఎస్‌ నుంచి అందని సాయం!

ABN , First Publish Date - 2022-05-26T11:01:54+05:30 IST

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలోని కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ(సీసీఎస్‌) భవితవ్యంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పర్సన్‌ ఇన్‌చార్జి పాలన

సీసీఎస్‌ నుంచి అందని సాయం!

ఆర్టీసీ ఉద్యోగుల్లో కలవరం.. ముగిసిన పర్సన్‌ ఇన్‌చార్జి పాలన 

-గడువు పొడిగింపుపై తేల్చని వైనం

-భవితవ్యంపై సర్వత్రా ఆందోళన

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలోని కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ(సీసీఎస్‌) భవితవ్యంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పర్సన్‌ ఇన్‌చార్జి పాలన ముగియడం.. సీసీఎస్‌ నుంచి 15 వేల మందికి అందాల్సిన ఆర్థిక సాయం నిలిచిపోవడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. తమ వేతనాల నుంచి నెల నెలా మినహాయించిన మొత్తాన్ని యాజమాన్యం ఎప్పటికప్పుడు సీసీఎస్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఆదాయం లేక అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ యాజమాన్యం సీసీఎ్‌సకు చెల్లించాల్సిన రూ.850  కోట్లకు పైగా నిధులను దారి మళ్లించింది. 22తో పర్సన్‌ ఇన్‌ చార్జి పాలన ముగిసినా.. సహకార శాఖ ఆ గడువును పొడిగించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, గృహ నిర్మాణం తదితర అవసరాల కోసం సీసీఎ్‌సలో పొదుపు చేసుకున్న నిధుల నుంచి ఆర్థిక సాయం చేయాలంటూ ఉద్యోగులు చేసిన విన్నపాలకు అతీగతీ లేకుండా పోయింది. గతంలో ఆర్టీసీ యాజమాన్యం.. రూ.1200 కోట్లకుపైగా బకాయి పడటంతో సీసీఎస్‌ పాలక మండలి కోర్టును ఆశ్రయించింది. ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్న నిధులను తక్షణం చెల్లించాలంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆర్టీసీ యాజమాన్యం మొత్తం రూ.450 కోట్లు సర్దుబాటు చేయగలిగింది. మిగిలిన మొత్తం దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. నెల నెలా ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సుమారు రూ.25 కోట్లకు తోడు బకాయిల మొత్తం తీర్చే వరకు నెలకు రూ.60 కోట్ల వరకు విడుదల చేస్తామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగకపోవడంతో  బకాయిలను సర్దుబాటు చేయలేక.. మూడు నెలల పాటు రూ.25 కోట్ల చొప్పున విడుదల చేశారు. సీసీఎస్‌ రుణ సాయం కోసం, అడ్వాన్స్‌ కోసం దరఖాస్తు చేసిన ఉద్యోగులకు జనవరి రెండో వారం వరకు నిధులు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఖాతాలో నిధులు నిండుకోవడంతో చెల్లింపులను సీసీఎస్‌ నిలిపివేసింది. ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో పాటు సీసీఎస్‌ నిధులు ఇకపై విడుదలయ్యే అవకాశం లేదని భావించిన దాదాపు 10వేల మంది ఉద్యోగులు సభ్యత్వం రద్దు చేసి ఖాతా సెటిల్‌ చేయాలంటూ దరఖాస్తు చేసినట్టు తెలిసింది. నిధుల లేమి కారణంగా.. రుణం కోసం 5వేల మంది ఉద్యోగులు చేసిన అభ్యర్థనలు పరిశీలన దశలోనే పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. అలాగే రిటైర్డ్‌ ఉద్యోగులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో దాచుకున్న డబ్బుకు సంబందించి నెల నెలా చెల్లించాల్సిన వడ్డీని సైతం సీసీఎస్‌ నిలిపివేసింది. పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పాలన గడువు మే 22వ తేదీతో ముగిసినా.. మరొకరిని నియమించకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పర్సన్‌ ఇన్‌చార్జి పాలన ముగిసేలోపే(22వ తేదీ) ఎన్నికలు నిర్వహించాలి. లేదంటే మరో 6 నెలల వరకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ను నియమించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పర్సన్‌ ఇన్‌చార్జిని నియమించకపోవడంతో... సీసీఎస్‌ భవితవ్యం ఏమిటా? అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-05-26T11:01:54+05:30 IST