సెకండ్‌ వేవ్‌ దాటేందుకు కనీసం 3 నెలలు

ABN , First Publish Date - 2021-04-29T19:05:38+05:30 IST

దేశంలో కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనేందుకు కనీసం 3 నెలలు పడుతుందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటిస్తే మే నెలాఖరుకు కరోనా కేసులు పతాకస్థాయికి చేరి, ఆ తర్వాత తగ్గేఅవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్‌ వేగంగా మార్పులు చెందుతున్నందున..

సెకండ్‌ వేవ్‌ దాటేందుకు కనీసం 3 నెలలు

ఈ వైరస్‌ విచిత్రంగా ఉంది.. 

అప్రమత్తంగా లేకుంటే మూడోవేవ్‌ ముప్పు

డ్రైస్వాబ్‌ పరీక్షలు చవకైనవి, సులువైనవి

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరీక్షలు చేయాలి

‘ఆంధ్రజ్యోతి’తో సీసీఎంబీ డైరెకటర్‌ రాకేశ్‌ మిశ్రా



దేశంలో కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనేందుకు కనీసం 3 నెలలు పడుతుందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటిస్తే మే నెలాఖరుకు కరోనా కేసులు పతాకస్థాయికి చేరి,  ఆ తర్వాత తగ్గేఅవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్‌ వేగంగా మార్పులు చెందుతున్నందున.. ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించకపోతే మూడోవేవ్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదంటున్న రాకేశ్‌ మిశ్రాతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..


సెకండ్‌ వేవ్‌ ఇంత ఉద్ధృతం కావడానికి కారణం?

వైర్‌సలో వేగంగా, అనూహ్యంగా మార్పులు వస్తున్నాయి. డబుల్‌ మ్యుటేషన్‌, బ్రిటన్‌ రకం వైర్‌సలు కేసులు వేగంగా పెరగడానికి ముఖ్య కారణం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం వైర్‌సల వ్యాప్తి తక్కువగా ఉన్నా.. పంజాబ్‌, హరియాణాల్లో యూకే రకం వైరస్‌, మహారాష్ట్రతో పాటు పశ్చిమ భారతంలో డబుల్‌ మ్యుటేషన్‌ వైరస్‌  విస్తృతంగా వ్యాపించింది. వాటి వల్లే కేసులు ఉప్పెనలా వస్తున్నాయి. 


సెకండ్‌ వేవ్‌లో యువత అధిక సంఖ్యలో కరోనా బారిన పడటానికి ప్రత్యేక కారణం ఉందా?

దీనిపై అధ్యయనాలు జరగాల్సి ఉంది. మొదటి దశలో కేసులు తగ్గిన తరువాత.. యువత సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. కరోనా తగ్గిపోయిందని భావించి చాలా మంది మాస్క్‌లు వదిలేశారు. సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం విస్మరించారు. ఈసారి అధిక శాతం యువత కరోనా బారిన పడడానికి ఇవే ముఖ్య కారణాలని అని నా భావన.


ఎక్కువ మందికి ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది?

వైరస్‌ దాడి తీవ్రత వల్ల అలా జరుగుతుందని చెప్పలేం. సెకండ్‌ వేవ్‌లో వ్యాధి లక్షణాలు లేకుండా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆలస్యంగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఎక్కువమంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల కూడా ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోతాయి.


రాత్రి పూట కర్ఫ్యూలు, ఇతరత్రా ఆంక్షలు కరోనా కట్టడికి ఎంత వరకు తోడ్పడతాయి?

ప్రభుత్వాలు అమలు చేస్తున్న కర్ఫ్యూలు, ఆంక్షలు.. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకునేందుకు చాలా వరకూ దోహదం చేస్తాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. జనం ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న అన్ని రకాల సామాజిక కార్యక్రమాలనూ తక్షణం ఆపేయాలి. ప్రజలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయమిది. 


జనవరిలో మీ సీరో సర్వేలో 50 శాతానికి పైగా ప్రజలకు కరోనా వచ్చిపోయిందని తేలింది కదా?

హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో 50 శాతానికి పైగా ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నట్లు సర్వేల్లో నిర్ధారణ అయింది. అయినా ఇంకా 50 శాతం మంది వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది కదా? 70 శాతం మందికిపైగా ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నప్పుడే హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 


సెకండ్‌ వేవ్‌ పతాక స్థాయికి ఎప్పుడు చేరుతుంది? కేసులు ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది?

మే చివరిలోగా  కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం మరిన్ని జాగ్రత్తలు పాటిస్తేనే అది సాధ్యం. ఏ మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరించినా వైరస్‌ మరింత విజృంభిస్తుంది. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న వేగాన్ని బట్టి చూస్తే మరో మూడు నెలల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే.


మూడో వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందంటారా?

ఊహకు అందని విధంగా, విచిత్రంగా మారడం కొవిడ్‌ వైరస్‌ ప్రధాన లక్షణం. ఆ వైర్‌సలో ఆరువేలకు పైగా ఉత్పరివర్తనాలు జరిగాయి. పలు కొత్త వేరియంట్స్‌ వస్తున్నాయి. మరిన్ని మార్పులు జరిగే అవకాశాలున్నాయి. వైరలో ఆ మార్పులు సహజం. దాన్ని అడ్డుకునేందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నామనేది ప్రధానాంశం.      


      - స్పెషల్‌ డెస్క్‌


డ్రైస్వాబ్‌ విధానంలో ఎక్కువ పరీక్షలు జరగట్లేదు?

కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితం రావడానికి 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. శాంపిల్స్‌ సేకరణ కూడా కష్టంతో కూడుకున్న పని. అదే.. డ్రైస్వాబ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తే 3 గంటల్లో ఫలితం ఇవ్వవచ్చు. ఖర్చు కూడా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే డ్రైస్వాబ్‌ పరీక్షలకు సంబంధించిన టెక్నాలజీని అందించేందుకు సీసీఎంబీ సిద్ధంగా ఉంది. అన్ని రాష్ట్రాలకూ మేం లేఖలు రాశాం.

Updated Date - 2021-04-29T19:05:38+05:30 IST