Abn logo
Apr 19 2021 @ 04:32AM

అధికారులు వచ్చారు... వెళ్లారు..!

వైసీపీ నేతల ఒత్తిళ్లతో గోడ కూల్చేందుకు మరింత గడువు?


వీరులపాడు, ఏప్రిల్‌ 18: వీరులపాడు మండలం పెద్దాపురంలో సీసీ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన వైనంపై ఆంధ్రజ్యోతిలో వెలువడిన కథనానికి ఆదివారం పంచాయతీ అధికారులు స్పందించారు. పంచాయతీ కార్యదర్శి గొర్రెపాటి శ్యామ్‌కుమార్‌ జేసీబీతో ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుపై ఆక్రమంగా నిర్మించిన గోడను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీ పంచాయతీ వార్డు సభ్యుడి కుటుంబీకులు గోడను తొలగించటానికి వీల్లేదని, తమకు మరో 24 గంటలు సమయం ఇవ్వాలని జేసీబీకి అడ్డంగా కూర్చున్నారు. స్థానిక వైసీపీ నేతలు పంచాయతీ కార్యదర్శిపై ఫోనులో ఒత్తిడి తెచ్చారు.


దీంతో చేసేదిలేక జేసీబీ సహా కార్యదర్శి వెనుదిరిగారు. దీనిపై కార్యదర్శి శ్యామ్‌కుమార్‌ను వివరణ కోరగా... ‘‘అక్రమ కట్టడాన్ని మరో 24 గంటల్లో తొలగిస్తాం. రోడ్డును ఆక్రమించి గోడ నిర్మించిన మాట వాస్తవం. సమయం కోరటంతో ప్రస్తుతం గోడ కూల్చివేత పనులు నిలిపివేశాం. సోమవారం ఉదయం 10 గంటలకు తదుపరి చర్యలు చేపడతాం’’ అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement