తన ఇంటికి ఎదురుగా అమర్చిన సీసీ కెమెరాను చూపిస్తున్న మేయర్ పావని
ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మేయర్ పావని
కార్పొరేషన్(కాకినాడ): నగర ప్రథమ పౌరురాలనే కనీస గౌరవం లేకుండా తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం దారుణమని కాకినాడ మేయర్ సుంకర పావని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగమన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన రెండు సీసీ కెమెరాలతో పాటు చెట్ల కొమ్మలు నరికి మరీ మరో కెమెరా పెట్టారన్నారు. తన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు కలుస్తున్నారని నిఘా పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. అల్లరి మూకలతో భయానక పరిస్థితులు కలుగుజేస్తున్నారన్నారు. తాను ఎస్పీకి ఫోన్ చేసి పై విషయాలు తెలపగా సీఐ రామకోటేశ్వరరావు వచ్చి పరిస్థితులను గమనించారన్నారు.
గతంలో స్మార్ట్ సిటీ, కార్పొరేషన్ ద్వారా చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే తన ప్రతిభగా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. తనపై ఎన్ని కక్ష సాధింపు చర్యలకు గురి చేసినా మేయర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. తనకు ప్రజల మద్దతు ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా ఎదుర్కొంటానన్నారు. మహిళా ప్రజాప్రతినిధినని కూడా చూడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కార్పొరేటర్లకు అభిమానం ఉందని, వాళ్లను భయపెట్టడం వల్లే బయటకు రావట్లేదని చెప్పారు.