దేవుళ్ల భద్రత.. నిఘా నేత్రంలో.. స్వామివార్ల ఆభరణాలకు, రథాలకు ఇన్సూరెన్స్‌

ABN , First Publish Date - 2020-09-19T20:41:21+05:30 IST

రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆలయాలను స్టేషన్‌ అధికారులు సందర్శిస్తూ

దేవుళ్ల భద్రత.. నిఘా నేత్రంలో.. స్వామివార్ల ఆభరణాలకు, రథాలకు ఇన్సూరెన్స్‌

ప్రభుత్వ ఆదేశాలతో ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం

విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటు

పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందితో పహారా

స్వామివార్ల ఆభరణాలకు, రథాలకు ఇన్సూరెన్స్‌


నెల్లూరు (సాంస్కృతికం): రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు  ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆలయాలను స్టేషన్‌ అధికారులు సందర్శిస్తూ, ఆలయ అధికారులకు, సిబ్బందికి భద్రతా సూచనల చేస్తున్నారు. ఇక నెల్లూరులోని అన్ని దేవాలయాలు, స్వామివార్ల రథాలకు భద్రతపై చర్య లు చేపట్టారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 23 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆలయంలోని బం గారం, వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్‌ చేయడంతోపాటు లాకర్స్‌లో భద్రపరిచినట్టు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరాలయంలో 11, రథం వద్ద 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఈవో ఏ.వేణుగోపాల్‌ తెలిపారు. అలాగే  బంగారం, వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్‌ చేసి ఉన్నామన్నారు. శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలో 17 సీసీ కెమెరాలు  ఏర్పాటు చేసినట్లు సహాయ కమిషనర్‌ జె.శ్రీనివాసరావు తెలిపారు.


రథంతోపాటు స్వామివారి బంగారం, వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్‌ చేశామన్నారు. రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్వామి వారి రథం, బంగారు, వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్‌ చేశారు. భద్రతకు సిబ్బందిని కూడా నియమించినట్లు ఈవో డి.వెంకటేశ్వర్లు తెలిపారు. సంతపేట ఆంజనేయస్వామి ఆలయంలో 14, రాయాజీవీధిలో ఆంజనేయస్వామి ఆలయంలో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా,  అన్ని రకాల ఆలయాల్లో గతంలోనే సీసీ కెమెరాలే ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణపై భద్రత లేకపోవడంతో పని చేయక మూలబడ్డాయి. ఉన్నతాధికారులు ఆదేశాలతో మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. 


నెల్లూరు రూరల్‌ : వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఆలయం ప్రధాన ద్వారంతోపాటు స్వామి, అమ్మవార్ల సన్నిధి ప్రాంతాలను సైతం నిఘానేత్రం పరిధిలోకి తెచ్చారు. నిత్యం ఇద్దరు వ్యక్తులతో పహారా కాస్తున్నారు. పైగా  స్వీపర్లు కూడా రాత్రుళ్లు ఆలయం వద్ద ఉండేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి అతి సమీపాన జిల్లా పోలీసు వైర్‌లెస్‌ వ్యవస్థ టవర్లు ఉండటంతో అక్కడ డ్యూటీలో ఉండే పోలీసులు ఆలయ భద్రతలో భాగస్వాములవుతున్నారు. ఇక కొండ కిందనున్న రథానికి అన్ని రకాల భద్రతా చర్యలు ఉన్నాయని ఇటీవల అధికారుల బృందం తేల్చింది. 


బుచ్చిరెడ్డిపాళెం : జొన్నవాడ, బుచ్చి ఆలయాల ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డి, కమిటీల చైర్మన్లు చీమల రమే్‌షబాబు, దొడ్ల మురళీకృష్ణారెడ్డి ఆలయాలతోపాటు రఽథాల రక్షణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు ఆలయాల్లో ఒక్కో రఽథానికి రూ.50లక్షల మేర ఇన్సూరెన్సు చేయించారు.  ఆలయాల పరిసరాలు, రఽథాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అదేవిధంగా పోలీసుల నిఘా కూడా ఉంటుంది. 


బిట్రగుంట : కొండబిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ భద్రత కోసం  చర్యలు తీ సుకుంటున్నారు. ఈవో, పాలక మం డలి చైర్మన్‌ గది కాకుండా ఇతర ముఖ్యమైన చోట్ల  16 సీసీ కెమెరా లు ఏర్పాటు చేశారు. ఇక కాపలా కోసం మరో ఇద్దరిని నియమించా రు. అయితే అదనంగా 5 సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈవో మల్లికార్జున రెడ్డి తెలిపారు. 


రాపూరు : పెంచలకోన క్షేత్రం సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతోంది. క్షేత్రంలోని ముఖ్య ప్రాంతాలలో 33  కెమెరాలను ఏర్పాటు చేసి మోనిటర్‌కు అనుసంధానం చేశారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య కార్యాలయంలోనే ఉంటూ మోనిటర్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి ఆలయం వెనుక వైపు, ప్రధాన ముఖద్వారం వద్ద చుట్టూ ఇనుప రేకులతో ఏర్పాటు చేసి షెడ్‌లో అత్యంత భద్రంగా రథం ఉంచారు. రథానికి అన్నివైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం భద్రతా ఏర్పాట్లను వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు.


సూళ్లూరుపేట : తెలుగు, తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా కొలవబడే సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం 24 గంటలపాటు తెరిచే ఉంటుంది. దీంతో ఆలయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి వున్నారు. ఆలయం లోపల, ఆవరణ మొత్తం 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక భక్తుల వసతి గృహ సముదాయాల వద్ద మరో 16 కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు జరగుతున్నాయి. అలాగే 8 మంది గార్డులు నిత్యం కాపలా  ఉంటున్నారు.

Updated Date - 2020-09-19T20:41:21+05:30 IST