ప్రపంచ ఇన్వెస్టర్ల చూపు.. సిటీ వైపు...

ABN , First Publish Date - 2021-01-26T06:39:42+05:30 IST

సైబరాబాద్‌లో మూడు జోన్‌లు..

ప్రపంచ ఇన్వెస్టర్ల చూపు.. సిటీ వైపు...
ప్రత్యేక పోలీస్‌ వాహనాలను ప్రారంభిస్తున్న డీజీపీ

శాంతి భద్రతల పరిరక్షణలోనే..

డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ/గచ్చిబౌలి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌లో మూడు జోన్‌లు.. 18 పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 111 కమ్యూనిటీ్‌సలో ఏర్పాటు చేసిన 2058 సీసీటీవీ కెమెరాలను సీపీ సజ్జనార్‌తో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రాంభోత్సవం అనంతరం డీజీపీ మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలన్నా.. సంపద పెరగాలన్నా.. శాంతి భద్రతల పరిరక్షణ చాలా ముఖ్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్‌లు అందరూ ఇప్పుడు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారన్నారు. సైబరాబాద్‌లో ఒకే రోజు ఇంతపెద్ద ఎత్తున వేల సంఖ్యలో సీసీటీవీలు ఏర్పాటు చేయడం అతిపెద్ద ముందడుగు అన్నారు. రాష్ట్రంలో 10లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్‌లోనే 6.50లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌తో పాటు.. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు డీజీపీ తెలిపారు. 


టెక్నాలజీకి పెద్దపీట..

తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తున్న అన్ని రకాల టెక్నాలజీలను టీఎస్‌ కాప్స్‌ యాప్స్‌తో అనుసంధానం చేశామన్నారు. ఇప్పుడు సమస్త సమాచారం టీఎస్‌ కాప్స్‌లో అందుబాటులో ఉందన్నారు. నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినా, సోషల్‌మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా ఒకే విధమైన రెస్పాన్స్‌ ఉంటుందని డీజీపీ తెలిపారు. 


5 వేల నుంచి 1.26 లక్షల కెమెరాలు.. 

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. 2018లో కేవలం 5వేలు మాత్రమే ఉన్న సీసీటీవీ కెమెరాలు ప్రస్తుతం 1,26,760కు చేరుకున్నాయని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2.50లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఎ్‌సఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, టీఎ్‌సఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌, ఎస్సీఎస్సీ జనరల్‌ సెక్రటరీ కృష్ణఏదుల, హైసియా ప్రెసిడెంట్‌ భరణి అరోల్‌, ట్రా ఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, బాలానగర్‌ డీసీపీ పద్మజ పాల్గొన్నారు.


నేరస్థుల గుట్టు చెప్పేస్తాయ్‌..!

సైబరాబాద్‌లో కెమెరా మౌంటెడ్‌ వాహనాలు

అనుమానితుల కదలికలపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌లో మూడు కెమెరా మౌంటెడ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి చేతులమీదుగా సోమవారం ఆ వాహనాలను ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. మాదాపూర్‌, బాలానగర్‌, శంషాబాద్‌ జోన్‌లలో ఒక్కో వాహనం 24/7 తిరుగుతుంది. పోలీస్‌ వాహనంపై ఏర్పాటు చేసిన మౌంటెడ్‌ కెమెరాలు 360 డిగ్రీలు తిరుగుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో తిరిగే వాహనాలు.. అనుమానితుల వ్యక్తులను, క్రిమినిల్స్‌ను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని జైలు నుంచి విడుదలైన వ్యక్తులు, నేర చరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలను పసిగడతాయి. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ఈ మౌంటెడ్‌ కెమెరాలున్న వాహనాలు  కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. కమిషనరేట్‌ పరిధిలోని అన్ని జోన్‌లలో పోలీసులు గుర్తించిన క్రైం హాట్‌స్పాట్స్‌లో ఈ వాహనాలతో పెట్రోలింగ్‌ ప్రత్యేక తనిఖీలు చేస్తారన్నారు. 


కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం..

ఈ మౌంటెడ్‌ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేసినట్లు సీపీ తెలిపారు. అక్కడి నుంచి ప్రతి క్షణం ఆ కెమెరాల విజువల్స్‌ను ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. అనుమానాస్పద విషయం తెలిసిన వెంటనే సంబంధిత  అధికారులకు తెలియజేస్తారు. వాహనంలోని సిబ్బంది అప్రమత్తమై నేరనివారణకు, నేరస్థులను పట్టుకోవడానికి కృషి చేస్తారన్నారు. 

Updated Date - 2021-01-26T06:39:42+05:30 IST