CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి అంటే..

ABN , First Publish Date - 2021-10-19T13:16:39+05:30 IST

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) నిర్వహించనున్న..

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి అంటే..

న్యూఢిల్లీ: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) నిర్వహించనున్న 10, 12వ తరగతుల టెర్మ్‌-1 పరీక్షల షెడ్యూల్‌ సోమవారం విడుదలైంది. పదో తరగతి పరీక్షలు నవంబరు 30 నుంచి డిసెంబరు 11 వరకు నిర్వహిస్తామని సీబీఎస్ఈ తెలిపింది. అలాగే, 12వ తరగతి పరీక్షలు డిసెంబరు 1 నుంచి 22 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. 10, 12 తరగతుల పరీక్షలు అన్నీ ఆయా తేదీల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు (90 నిమిషాలు) జరుగుతాయని వివరించింది. తాము ప్రకటించిన ఈ పరీక్షల తేదీలు మేజర్‌ సబ్జెక్టులకేనని తెలిపింది.


మైనర్‌ సబ్టెక్టులకు పరీక్షల తేదీలు ఆయా పాఠశాలలకే పంపుతామని వివరించింది. మైనర్‌ సబ్జెక్టులకు సంబంధించి 12వ తరగతి పరీక్షలు నవంబరు 16 నుంచి, పదో తరగతి పరీక్షలు నవంబరు 17 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. 12వ తరగతిలో మొత్తం 114 సబ్జెక్టులను సీబీఎస్ఈ అందిస్తోంది. వాటిలో 19 మేజర్‌ సబ్జెక్టులు ఉంటాయి. అలాగే, పదో తరగతిలో మొత్తం 75 సబ్జెక్టులు ఉండగా, వాటిలో తొమ్మిది మేజర్‌ సబ్టెక్టులు ఉన్నాయి. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2021-22 బ్యాచ్‌ విద్యార్థులకు రెండు టెర్మ్‌లుగా పరీక్షలు నిర్వహించాలని సీబీఎ్‌సఈ నిర్ణయించిన విషయం తెలిసిందే. టెర్మ్‌-2 పరీక్షలు 2022 మార్చి-ఏప్రిల్‌ మధ్య జరుగుతాయి.


సోషల్‌ మీడియాలో ‘నకిలీ షెడ్యూల్‌’

సీబీఎస్ఈ పరీక్షల తేదీలు అధికారికంగా వెలువడకముందే సోషల్‌ మీడియాలో ఓ ‘నకిలీ షెడ్యూల్‌’ చక్కర్లు కొట్టింది. దీనిపై సీబీఎస్ఈ స్పందించింది. సోషల్‌ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని చెప్పింది. పరీక్ష తేదీలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలని సూచించింది. 

Updated Date - 2021-10-19T13:16:39+05:30 IST