సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు

ABN , First Publish Date - 2021-04-14T19:53:22+05:30 IST

సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది...

సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి పరీక్షల కోసం కొత్త తేదీలను విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీబీఎస్ఈ విద్యార్ధులు సైతం బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఆన్‌లైన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. పరీక్షల రద్దు కోసం పెట్టిన ఆన్‌లైన్ పిటిషన్‌పై 2 లక్షల మందికి పైగా విద్యార్థులు సంతకాలు చేశారు. 

Updated Date - 2021-04-14T19:53:22+05:30 IST