వివేకా హత్య కేసులో సీఐ శంకరయ్యను విచారించిన సీబీఐ

ABN , First Publish Date - 2022-02-25T02:17:07+05:30 IST

మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. వివేకా హత్య జరిగిన సమయంలో ఉన్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యను సీబీఐ

వివేకా హత్య కేసులో సీఐ శంకరయ్యను విచారించిన సీబీఐ

కడప: మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. వివేకా హత్య జరిగిన సమయంలో ఉన్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యను సీబీఐ ఉన్నతాధికారులు గురువారం మరోసారి విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు కడప కేంద్ర కారాగారం అతిఽథి గృహం, పులివెందుల రోడ్లు భవనాల అతిఽథి గృహం కేంద్రంగా పలువురు సాక్షులు, అనుమానితులను సీబీఐ విచారించింది. సీఐ శంకరయ్యను కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సీబీఐ ఉన్నతాధికారి విచారించారని తెలిసింది. 2019 మార్చి 15న వివేకా పులివెందుల పట్టణం బాకరాపురంలో ఉన్న స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడు పులివెందుల సీఐగా శంకరయ్య విధుల్లో ఉన్నారు. వివేకా కుమార్తె డాక్టరు సునీత విన్నపం మేరకు ఈ కేసు విచారణను 2020 మార్చి 11న హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అదే ఏడాది జూలై నెలలో సీబీఐ రంగంలోకి దిగింది. 246 మందికి పైగా అనుమానితులు, సాక్షులను విచారించారు. 


అందులో భాగంగానే నాటి సీఐ శంకరయ్యను 2020 జూలై 28న, 2021 సెప్టెంబరు 28న రెండు పర్యాయాలు సీబీఐ అధికారులు విచారించారు. విచారణలో సీబీఐ అధికారుల ఎదుట సీఐ శంకరయ్య వెల్లడించిన కీలక అంశాలు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసు విషయంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సహా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తెచ్చారని, వివేకా గుండెపోటుతో మృతి చెందారని ఎంపీ అవినాశ్‌రెడ్డి తనకు ఫోన్‌లో చెప్పారని సీఐ శంకరయ్య సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. గుండె పోటు, రక్తపు వాంతుల కట్టుకథ, బాత్‌రూం నుంచి వివేకా మృతదేహం బెడ్‌రూంలోకి మార్చడం, అక్కడ దుప్పటి మార్చడం, మృతదేహానికి కుట్లు వేయడం.. ఇలా అన్నీ అనుమానాస్పదంగా జరిగాయని వెల్లడించారు. అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ఆధ్యర్యంలోనే ఆధారాలను చెరిపేశారని సీబీఐ అధికారుల విచారణలో సీఐ శంకరయ్య స్పష్టంగా వివరించారు. 

Updated Date - 2022-02-25T02:17:07+05:30 IST