కాన్పూర్ పోలీసులపై CBI కేసు..యూపీలో సంచలనం

ABN , First Publish Date - 2021-11-03T13:08:36+05:30 IST

ప్రముఖ వ్యాపారి హత్య కేసులో నిందితులైన కాన్పూర్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది....

కాన్పూర్ పోలీసులపై CBI కేసు..యూపీలో సంచలనం

వ్యాపారి హత్య కేసులో విచారణ

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారి హత్య కేసులో నిందితులైన కాన్పూర్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. కాన్పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనీష్ గుప్తా మృతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు సిఫారసు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో కేంద్ర ఏజెన్సీ అయిన సీబీఐ విచారణ చేపట్టి ఈ వ్యవహారంపై కాన్పూర్ పోలీసులపైనే కేసు నమోదు చేసింది.సెప్టెంబరు 27న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని ఒక హోటల్‌లో సోదాలు జరిపిన సందర్భంగా 38 ఏళ్ల ప్రాపర్టీ డీలర్ మనీష్ గుప్తాపై దాడి చేసి హత్య చేశారని ఉత్తరప్రదేశ్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. 


ఈ కేసులో నిందితులుగా గోరఖ్‌పూర్‌లోని రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు అక్షయ మిశ్రా, విజయ్ యాదవ్, మరో ముగ్గురు పోలీసు సిబ్బంది ఉన్నారని సీబీఐ ఇన్‌స్పెక్టర్ జగత్ నారాయణ్ సింగ్ చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసును యూపీ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. వ్యాపారి హత్య కేసులో ఆరుగురు అధికారులపై కేసు నమోదు చేసి సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు. నిందితులైన పోలీసులు మొదట పరారీలో ఉన్నప్పటికీ, అక్టోబర్‌లో నిందితులందరినీ అరెస్టు చేశారు. 



సీఎం సూచన మేర వ్యాపారి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ యూపీ హోంశాఖ కోరింది.మృతుడి భార్యకు కాన్పూర్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు హోం శాఖ పేర్కొంది. మృతుడి కుటుంబానికి రూ. 40 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది. మనీష్ గుప్తాకు భార్య, నాలుగేళ్ల పాప ఉన్నారు.

Updated Date - 2021-11-03T13:08:36+05:30 IST