విశ్వసనీయత కోల్పోతున్న సిబిఐ

ABN , First Publish Date - 2021-07-23T09:30:15+05:30 IST

సిబిఐ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు దాని విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న...

విశ్వసనీయత కోల్పోతున్న సిబిఐ

సిబిఐ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు దాని విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణలో ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు తార్కాణం. వేలకోట్ల అవినీతి ఆరోపణలపై అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సుదీర్ఘకాలం పాటు పాలనలో కొనసాగే వెసులుబాటును కల్పించడం దేశద్రోహం కాదా? ముద్దాయిలు అమాయకులని తుది విచారణలో న్యాయస్థానాలు నిర్ధారిస్తే, ఆ నేరస్తులు సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగుతూ పరిపాలన సాగిస్తే జరిగే అనర్థాలకు సిబిఐ బాధ్యత వహించవలసి ఉంటుంది.


ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌ను వాస్తవానికి సిబిఐ వేయవలసింది. కానీ దశాబ్దకాలం పాటు కేసును నత్తనడక నడిపి నిందితులు, సహనిందితులను ప్రతిపక్షనేతలుగా, తర్వాత ప్రభుత్వ పాలకులుగా కొనసాగే వెసులుబాటును ఉద్దేశపూర్వకంగా కలిగించిందనే నిందను సిబిఐ మోస్తూ ఉండడం బాధాకరం. రఘురామ వేసిన పిటిషన్‌కు కనీస మద్దతు ఇవ్వకుండా గోడ మీద పిల్లి తరహాలో వ్యవహరిస్తూ తాము చెప్పవలసింది చెప్పామని, ఇక ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానానికి విన్నవించడం సిబిఐ బాధ్యతారాహిత్యం. ఇక మీదట వాయిదాలు ఇవ్వబోమని న్యాయస్థానం స్పష్టం చేశాక కూడా, నెల రోజుల క్రితం కోర్టుకు చెప్పిన మాట మార్చి మళ్లీ సమయం కోరడం, ‘పదిరోజులు సమయమిస్తే తాము కూడా వాదనలు సమర్పిస్తామ’నడం ఇంకో విడ్డూరం. సిబిఐ వ్యవహార సరళి వెనుక ఏవైనా అదృశ్యశక్తుల ప్రమేయం ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.


నేరచరిత్ర కలిగిన రాజకీయ నాయకుల కేసులను ఒక సంవత్సరంలోగా పరిష్కరించాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం తుంగలో తొక్కేలా సిబిఐ ధోరణి ఉంటోంది. సిబ్బంది, నిధులు, వనరులు, వసతుల వంటి సమస్యలుంటే ముందుగానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమకూర్చుకోవాలి తప్ప, ఏవో కుంటిసాకులతో నేరస్థులు తమ జీవితాంతం శిక్ష నుంచి తప్పించుకునే వెసులుబాటు కల్పించడం క్షమార్హం కాని విషయమని సిబిఐ గుర్తెరిగి వ్యవహరించాలి.

డా. ఎం.వి.జి అహోబలరావు

Updated Date - 2021-07-23T09:30:15+05:30 IST