Tuna Fish Export Scam : లక్షద్వీప్ ఎంపీ బంధువుపై సీబీఐ కేసు!

ABN , First Publish Date - 2022-06-28T21:42:13+05:30 IST

లక్షద్వీప్ ఎన్‌సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సమీప బంధువు అబ్దుల్

Tuna Fish Export Scam : లక్షద్వీప్ ఎంపీ బంధువుపై సీబీఐ కేసు!

న్యూఢిల్లీ : లక్షద్వీప్ ఎన్‌సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సమీప బంధువు అబ్దుల్ రజాక్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఓ కేసును నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ట్యూనా చేపల ఎగుమతి కుంభకోణం జరిగినట్లు సీబీఐ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైందని తెలుస్తోంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన విజిలెన్స్ డిపార్ట్‌మెంట్, సీబీఐ కలిసి నిర్వహించిన సోదాల్లో నేరారోపణ చేయదగిన పత్రాలు దొరికినట్లు సమాచారం. 


సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొలంబోలోని ఎస్ఆర్‌టీ జనరల్ మర్చంట్స్ అనే కంపెనీకి అబ్దుల్ రజాక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక మత్స్యకారుల వద్ద ఎల్‌సీఎంఎఫ్ కొనుగోలు చేసిన ట్యూనా చేపలను అంతర్జాతీయ సగటు ధర కిలోగ్రాముకు రూ.400 చొప్పున ఈ కంపెనీకి అమ్ముతున్నారు. ఈ కొనుగోళ్ళు, అమ్మకాలు, ఎగుమతుల కోసం ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మక్కయ్యారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎన్‌సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ పాత్రపై కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. 


ట్యూనా చేపల (Tuna Fish) ఎగుమతికి అనుమతులను నిబంధనలను పక్కనబెట్టి మంజూరు చేసినట్లు, లక్షద్వీప్ (Lakshdweep) ప్రజా ప్రతినిధి ఒత్తిడితోనే ఈ అనుమతులు ఇచ్చినట్లు సీబీఐ (CBI) తనిఖీల్లో వెల్లడైంది. టెండర్ల ప్రక్రియను కూడా అనుసరించలేదని తెలిసింది. ఎల్‌సీఎంఎఫ్‌కు ఎస్ఆర్‌టీ జనరల్ మర్చంట్స్ ఎటువంటి చెల్లింపులు జరపకపోవడంతో ఎల్‌సీఎంఎఫ్, స్థానిక మత్స్యకారులు భారీగా నష్టపోతున్నారు.  సోదాల్లో సేకరించిన రికార్డులను పరిశీలించిన తర్వాత నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలతో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను దాఖలు చేసే అవకాశం ఉంది. 


డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 25 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T21:42:13+05:30 IST