Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీబీఐ దూకుడు.. వైసీపీ నేతల్లో గుబులు!

అమరావతి: జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సీబీఐ వేగం పెంచడంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. పి. ఆదర్శ్, ఎల్ సాంబశివారెడ్డి, కొండారెడ్డి, సుధీర్‌ని అరెస్ట్ చేశారు. కువైట్‌ నుంచి వచ్చిన లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డి జులై 9న అరెస్ట్‌ చేశారు. అయితే ఎంపీ నందిగం సురేష్, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ పాత్రను పరిశీలిస్తున్నామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. 


న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ... సోషల్‌ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఇప్పటికి తాము గుర్తించిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎంపీ నందిగం సురేశ్‌, ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు.


వైసీపీ అభిమానులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసును సుమోటోగా విచారణ చేపట్టింది.  న్యాయస్థానం, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ‘కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ’ చర్యలకు ఆదేశించింది.

Advertisement
Advertisement