AP News: వివేకా హత్య కేసులో దస్తగిరి దంపతులను విచారించిన సీబీఐ

ABN , First Publish Date - 2022-09-23T01:55:57+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది.

AP News: వివేకా హత్య కేసులో దస్తగిరి దంపతులను విచారించిన సీబీఐ

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది. గురువారం సీబీఐ అధికారులు పులివెందుల (Pulivendula) ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా వివేకా మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి అతని భార్య షబానాను సీబీఐ అధికారులు పిలిపించి ప్రశ్నించారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో మూడవ నిందితుడుగా ఉన్న షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి కోర్టులో మెజిస్ర్టేట్‌ ముందు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఇతను చెప్పిన వివరాలే సీబీఐ అధికారుల విచారణకు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో దస్తగిరిని సీబీఐ అధికారులు మరోమారు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఈ కేసుని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో.. సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై అక్టోబరు 14లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. వివేకా హత్యకేసులో సాక్షులకు ముప్పు పొంచి ఉందని, ఈ కేసు దర్యాప్తును ఏపీ నుంచి హైదరాబాద్‌ లేదా ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 19న సుప్రీంకోర్టులో విచారించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాస నం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్యకేసులో సాక్షులకే కాకుండా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కూడా ముప్పు ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకే కేసు దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు, అదనపు చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తోందని చెప్పారు.

Updated Date - 2022-09-23T01:55:57+05:30 IST