ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు ఏడు రోజుల సీబీఐ కస్టడీ

ABN , First Publish Date - 2022-03-07T22:48:32+05:30 IST

నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు..

ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు ఏడు రోజుల సీబీఐ కస్టడీ

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రను సీబీఐ ఆదివారం ఢిల్లీలో అరెస్ట్ చేసింది.


చిత్రను సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు.. ఆమెను సీసీటీవీ పర్యవేక్షణలోనే విచారించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆమె తరపు న్యాయవాదులు ప్రతిరోజు సాయంత్రం కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రతి 24 గంటలకు ఒకసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.


సీబీఐ కేసును ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ ఎదుట సమర్పిస్తూ... దర్యాప్తునకు చిత్రా రామకృష్ణ సహకరించడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2,500కు పైగా ఈ-మెయిల్స్ విషయంలో ఆమె నేరారోపణ ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు.


ఇదే కేసులో సహ నిందితుడైన ఆనంద్ సుబ్రమణియన్‌తో గతంలో తనకున్న సంబంధాన్ని వెల్లడించేందుకు చిత్ర నిరాకరిస్తున్నారని సీబీఐ పేర్కొంది. అంతేకాదు, ఆయనను గుర్తించేందుకు కూడా నిరాకరిస్తున్నారని సీబీఐ తన వాదనల్లో పేర్కొంది.


సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం.. దర్యాప్తు నత్తనడకగా ఎందుకు సాగుతోందని ప్రశ్నించింది. అలాగే, ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ఇతర నిందితుల సంగతేంటని నిలదీసింది. ప్రయోజనాలు పొందినవారిలో వారే ముఖ్యులని, ఎఫ్ఐఆర్ నమోదై నాలుగేళ్లైనా వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 14న చిత్రను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

Updated Date - 2022-03-07T22:48:32+05:30 IST