మాజీ ముఖ్యమంత్రిపై అభియోగాలు నమోదు చేసిన సీబీఐ కోర్టు

ABN , First Publish Date - 2021-04-17T03:02:10+05:30 IST

సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం అభియోగాలు నమోదు చేసింది. భారత శిక్షాస్మృతిలోని 420, 120-బి సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని

మాజీ ముఖ్యమంత్రిపై అభియోగాలు నమోదు చేసిన సీబీఐ కోర్టు

చండీగఢ్: అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు ప్లాట్ రీ అలాట్‌మెంట్ కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం అభియోగాలు నమోదు చేసింది. భారత శిక్షాస్మృతిలోని 420, 120-బి సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేయాల్సిందిగా కోరుతూ హుడా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తూ వచ్చే నెల 7కు కేసు విచారణను వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో హుడాతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


పంచకులలోని సెక్టార్ 6లో ఉన్న సంస్థాగత ప్లాట్‌ను 1982లో హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఏజేఎల్‌కు కేటాయించింది. అయితే, పదేళ్లు దాటినా అందులో నిర్మాణాలు చేపట్టకపోవడంతో 1992లో ఆ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఆ స్థలాన్ని మళ్లీ కేటాయించాల్సిందిగా 1995, 1996లో ఏజేఎల్ కోరినప్పటికీ హుడా నిరాకరించింది. 2005లో భూపిందర్ సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్థలాన్ని ఏజేఎల్‌కు తిరిగి కేటాయించారు. ఈ ప్లాట్‌ను ఏజేఎల్‌కు అక్రమంగా కేటాయించారని, కేటాయింపులో పలు అవకతకలు జరిగాయని ఆరోపణలు రావడంతో హుడాపై కేసు నమోదైంది. కాగా, ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది. 

Updated Date - 2021-04-17T03:02:10+05:30 IST