జీవీకేపై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2020-07-03T06:39:14+05:30 IST

జీవీకే గ్రూప్‌ నిర్వహణలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌)లో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ ద్వారా ఎంఐఏఎల్‌కు చెందిన రూ.705 కోట్ల నిధులను జీవీకే గ్రూప్‌ మళ్లించిందంటూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది

జీవీకేపై సీబీఐ కేసు

  • సంజయ్‌ రెడ్డి, ఏఏఐ అధికారులపైనా ఉచ్చు
  • ముంబై ఎయిర్‌పోర్టులో రూ.705 కోట్ల గోల్‌మాల్‌
  • ముంబై, హైదరాబాద్‌లో సోదాలు  జూ త్వరలో రంగంలోకి ఈడీ!


న్యూఢిల్లీ: జీవీకే గ్రూప్‌ నిర్వహణలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌)లో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ ద్వారా ఎంఐఏఎల్‌కు చెందిన రూ.705 కోట్ల నిధులను జీవీకే గ్రూప్‌ మళ్లించిందంటూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో జీవీకే గ్రూప్‌ చైర్మన్‌ గునుపాటి వెంకట కృష్ణా రెడ్డి (జీవీ కృష్ణా రెడి)్డ, ఆయన కుమారుడు, ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ సంజయ్‌ రెడ్డి, భారతీయ విమానాశ్రయ ప్రాధికారిక సంస్థ (ఏఏఐ) ఉన్నతాధికారులతో సహా మరో తొమ్మిది కంపెనీలపైనా  కేసులు నమోదు చేసింది. కాగా విమానాశ్రయ ఆధునికీకరణ, నిర్వహణ పేరుతో జీవీకే గ్రూప్‌ ఎలా మోసగించిందీ సీబీఐ తన దర్యాప్తులో వెల్లడించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు గాను సీబీఐ ఇప్పటికే ముంబై, హైదరాబాద్‌ల్లోని జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లకు చెందిన ఆరు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపింది. మరోవైపు సీబీఐ కేసు నమోదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని ఎంఐఏఎల్‌ తెలిపింది.


ఒప్పంద నేపథ్యం

ముంబై విమానాశ్రయ ఆధునికీకరణ, నిర్వహణ కోసం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) 2006లో టెండర్లు ఆహ్వానించింది. జీవీకే గ్రూప్‌ బిడ్‌ ఆకర్షణీయంగా ఉండంతో ఏఏఐ ఆ బిడ్‌కు అంగీకరించింది. దాంతో ఈ ప్రాజెక్టు కోసం జీవీకే గ్రూప్‌ సంస్థ అయిన జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌.. ఏఏఐతో కలిసి ఎంఐఏఎల్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ (జేవీ) కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ జేవీలో జీవీకే గ్రూప్‌నకు 50.05 శాతం, ఏఏఐకి 26 శాతం వాటా ఉండేలా ఒప్పందం కుదిరింది. మిగిలిన వాటాలను కొన్ని విదేశీ సంస్థలు తీసుకున్నాయి. ఎయిర్‌పోర్ఠ్‌ ఆధునికీకరణ తర్వాత వచ్చే ఆదాయంలో ఏఏఐకి ఏటా 38.7 శాతం ఫీజుగా ఇవ్వాలన్నది షరతు. 


బోగస్‌ వర్క్‌ కాంట్రాక్టులు

ఒప్పందంలో భాగంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి కోసం జీవీకే గ్రూప్‌నకు ఏఏఐ 200 ఎకరాల భూమిని అప్పగించింది. ఒప్పందం ప్రకారం జీవీకే గ్రూప్‌ ఈ భూమిని విమానాశ్రయ అభివృద్ధి, ఆదాయ కల్పన కోసం ఉపయోగించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా 2017లో జీవీకే గ్రూప్‌ ఈ భూమిని రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కోసమని తొమ్మిది కంపెనీలతో ఒప్పందాల కుదుర్చుకుంది. ఇవన్నీ బోగస్‌ ఒప్పందాలని సీబీఐ ఆరోపణ. ఎలాంటి పనులు జరగకపోయినా, వివిధ పనుల కోసమని జీవీకే గ్రూప్‌ ఈ కంపెనీలకు రూ.310 కోట్లు బదిలీ చేసింది. ఒక్క పనీ చేయకపోయినా ఈ తొమ్మిది కంపెనీలూ నకిలీ బిల్లులు పెట్టి ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాయి. 


ఖర్చుల గారడి

ఖర్చులకూ సంబంధించీ జీవీకే గ్రూప్‌ పెద్ద మాయే చేసినట్టు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ముంబై ఎయిర్‌పోర్టుతో ఎలాంటి సంబంధం లేకపోయినా గ్రూప్‌లోని ఇతర కంపెనీల ఉద్యోగుల జీతాలనూ ఎంఐఏఎల్‌ ఖాతా నుంచే చెల్లించింది. ఈ రూపంలోనే ఏఏఐకి దాదాపు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని కూడా కలిపితే ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.805 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.


ఆదాయానికి గండి 

ఆధునికీకరణ పూర్తయిన తర్వాత ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన ప్రాంతాల్లోని రిటైల్‌ షాపులను జీవీకే ప్రమోటర్లు, తమ కుటుంబ సభ్యులు, బంధుగణాలకు, కారు చౌకగా కట్టబెట్టిన విషయం కూడా సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో జీవీకే ప్రమోటర్ల జేబులు నిండినా, ఎంఐఏఎల్‌ ఆదాయానికి మాత్రం బాగానే గండిపడింది. దీనికి తోడు జీవీకే హోల్డింగ్‌ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల విమాన, రైలు టిక్కెట్ల బుకింగ్‌, హోటల్స్‌లో వారి విడిది ఖర్చులను కూడా జీవీకే గ్రూప్‌.. ఎంఐఏఎల్‌ ఖాతా నుంచే  చెల్లించినట్టు తేలింది. ఈ భారీ కుంభకోణంలో కొంతమంది ఏఏఐ ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని సీబీఐ భావిస్తోంది. దీంతో జీవీకే ప్రమోటర్లతో పాటు వారిని కూడా త్వరలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.


దుర్వినియోగం, నిధుల దారి మళ్లింపు

ఎంఐఏఎల్‌ రిజర్వు నిధులనూ జీవీకే గ్రూప్‌ దుర్వినియోగం చేసినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. ‘అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు’ 2012 నుంచి ఇప్పటి వరకు ఎంఐఏఎల్‌ మిగులు నిధుల్లో రూ.395 కోట్లను జీవీకే గ్రూప్‌, తన గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు మళ్లించింది. ఇందుకు అనుసరించిన విధానాన్నీ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ లో వివరించింది. ఎంఐఏఎల్‌ బోర్డు అనుమతించినట్టుగా ముందుగా కొన్ని నకిలీ తీర్మానాలు సృష్టించింది. ఆ నకిలీ తీర్మానాల సాయంతో మిగులు నిధులను హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసింది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌  పూచీపై ఓవర్‌ డ్రాఫ్ట్‌, రుణాలు తీసుకుని ఆ నిధులను తన గ్రూప్‌లోని ఇతర కంపెనీల పేరుతో వాడుకుంది. ఇంకా ఎంఐఏఎల్‌ మిగులు నిధులపై పూచీకత్తుపై జీవీకే గ్రూప్‌.. ఇతర బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకుని వాడుకున్నట్టు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

Updated Date - 2020-07-03T06:39:14+05:30 IST