రథం దగ్ధం కేసు దర్యాప్తునకు సీబీఐ సిద్ధం

ABN , First Publish Date - 2020-09-24T07:31:38+05:30 IST

అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై విచారణకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. రథం ఆహుతి ఘటన ప్రమాదమా... విద్రోహమా అనేది తేల్చడానికి ప్రాథమిక అధ్యయనం

రథం దగ్ధం కేసు దర్యాప్తునకు సీబీఐ సిద్ధం

ప్రాథమిక వివరాల అధ్యయనం మొదలుపెట్టిన అధికారులు

మూడు రోజుల కిందట కాకినాడ డీఎస్పీ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లిన పోలీసులు

కేసు వివరాలు, ఆధారాలు, ఫైళ్లు, నివేదికలు అందజేత

ఆంగ్లంలోకి కేసు పూర్వాపరాలు తర్జుమా చేసి సీబీఐ కార్యాలయంలో అందజేత

రథం ఆహుతి వీడియో, అనుమానితులు, ప్రమాదంపై జిల్లా కమిటీ రిపోర్టులు ఇచ్చిన పోలీసు శాఖ


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై విచారణకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. రథం ఆహుతి ఘటన ప్రమాదమా... విద్రోహమా అనేది తేల్చడానికి ప్రాథమిక అధ్యయనం మొదలుపెట్టింది. ఈ మేరకు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులు, ప్రమాదం జరిగిన తర్వాత ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తులో తేల్చిన  వివరాలు, ప్రమాదం జరిగిన తీరు తదితర అంశాలపై కూలంకషంగా దృష్టిసారించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో రథం ఆహుతికి సంబంధించి నమోదు చేసిన కేసులు, తేల్చిన దర్యాప్తు అంశాలు, అనుమానితుల వివరాలు, ఇతర ఫైళ్లన్నింటినీ మూడు రోజుల కిందట కాకినాడ డీఎస్పీ ఢిల్లీ వెళ్లి  అక్కడ సీబీఐ కార్యాలయానికి జిల్లా పోలీసు శాఖ తరపున అందించి వచ్చారు. అంతర్వేది ఆలయం రథం ఈ నెల ఆరవ తేదీ తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. భక్తులు పరమపవిత్రంగా కొలుచుకునే రథం మంటల్లో చిక్కుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.


అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా ఇంతవరకు తేలలేదు. ప్రమాదమా? విద్రోహమా? అనేది కూడా తెలియలేదు. తేనెపట్టు కోసం ఎవరో అగంతకులు పెట్టిన మంటవల్లే రథం ఆహుతైందని ఒకసారి, ఓ పిచ్చోడి చేష్ట వలనే ఈ అపచారం జరిగిందని ఒకసారి పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో  భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ద్రోహులెవరో తేల్చకుండా జరుగుతున్న తాత్సారానికి నిరసనంగా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక హిందూ సంఘాలు, పౌరోహిత్య సంఘాలు, భక్తులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు భారీ ఆందోళన చేపట్టాయి. వీహెచ్‌పీతో పాటు ఇతర ధార్మిక సంఘాలు ఆలయ ప్రాంతాన్ని వేలాదిమంది భక్తులతో చుట్టుముట్టాయి. ప్రమా దం జరిగిన తర్వాత ఘటన ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సహా మరో ఇద్దరు మంత్రులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు విసిరి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను సైతం ధ్వంసం చేసి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. పోలీసులు తలోమాట చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత పెంచేలా చేశాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ అధికారి అయిన కాకినాడ డీఎస్పీ బీమారావు మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు. అక్కడ సీబీఐ అధికారులను కలిశారు. రథం దగ్ధంపై నమోదు చేసిన కేసు ఫైళ్లు, ప్రాథమికంగా తాము దర్యాప్తు చేసిన వివరాలు, రథం ఆహుతవుతున్న వీడియోలు, అనుమానితుల వివరాలన్నింటినీ సీబీఐ ముఖ్య అధికారులకు అందజేశారు. మొత్తం వివరాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి నివేదిక రూపంలో అందించారు. ప్రమాదంపై జిల్లాస్థాయి అధికారులకమిటీ అందించిన వివరాలు, సిఫార్సుల నివేదికను కూడా సీబీఐకి అప్పగించారు.


మరోపక్క రథం ఆహుతైన నేపథ్యంలో దానికి సమీపంలో ఉన్న భవనాలు, రథం ఉంచిన ప్రాంతంపై ప్రత్యేకంగా తీయించిన వీడియోలను కూడా అప్పగించారు. దర్యాప్తునకు సంబంధించి జిల్లా పోలీసు శాఖ వద్ద ఉన్న మొత్తం వివరాలను సీబీఐకి అప్పగించారు. దీంతో అక్కడి అధికారులు కేసు పూర్వాపరాలకు సంబంధించిన వివరాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అనంతరం కేసుపై ఓ అంచనాకు వచ్చి దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించనుంది. ఆ బృందం త్వరలో అంతర్వేది రానుంది. ఘటనా స్థలంతో పాటు పోలీసులు, అనుమానితులు, ఆలయ సిబ్బందిలో కొందరిని ప్రశ్నించనుంది. 

Updated Date - 2020-09-24T07:31:38+05:30 IST