కావవే.. వరద

ABN , First Publish Date - 2022-04-29T06:29:02+05:30 IST

పురాణ కాలంలో మొసలి బారి నుంచి తనను రక్షించాలని కోరుతూ.

కావవే.. వరద

వీఆర్‌ఎస్పీలో అడుగంటిన జలాలు

మొసళ్ల ఉనికికి ముప్పు

వానలు కురిస్తేనే మనుగడ

ఆహారమూ కష్టమే


పురాణ కాలంలో మొసలి బారి నుంచి తనను రక్షించాలని కోరుతూ... ‘కావవే వరద’ అంటూ మహా విష్ణువును గజేంద్రుడు ప్రార్థించినట్టు మనం చదువుకున్నాం. ప్రస్తుత కాలంలో తమ ఉనికిని కాపాడాలని... వానలు...వరదలు వస్తేనే తమ మనుగడ కొనసాగుతుందని... ‘కావవే ‘వరద’ అంటూ మొసళ్లు వేడుకుంటున్నాయి. మండుతున్న ఎండలు... వాన జాడ లేకపోవడం... జలాలు అడుగంటడం వంటి కారణాలతో నల్లమలలోని వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌లో మొసళ్ల ఉనికి ప్రమాదంలో పడింది. ఎండకు తాళలేక...నీరు లేక...ఆహారం కరువై... అవి మృత్యువాత పడుతున్నాయి. 


ఆత్మకూరు, ఏప్రిల్‌ 28: మొసళ్లకు  ఆశ్రయమిచ్చిన వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌లో  జలాలు అడుగంటుతున్నాయి. రోజురోజుకూ నీటి మట్టం తగ్గుతుండడంతో వాటి ఉనికికి ముప్పు ఏర్పడుతోంది. 2000లో వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తయింది. 12ఏళ్ల తర్వాత 2012 నవంబర్‌ 28న ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఆది నుంచి ప్రాజెక్టు నిర్వహణ సవ్యంగా లేదు. ఒకప్పుడు అడవిలోని మునిమడుగుల వాగులో మొసళ్లు ఉండేవి. ప్రాజెక్ట్‌ నిర్మాణమయ్యాక అవన్నీ జలాశయంలోకి చేరినట్లు చెబుతారు. వీటికితోడు చెరువులు, కుంటల్లో కనిపించిన మొసళ్లను అటవీ అధికారులు వీఆర్‌ఎస్పీలో వదిలేవారు. వీటి జీవితకాలం 40ఏళ్ల నుంచి వందేళ్లు. దీర్ఘకాలం బతికే జీవి కావడం వల్ల వీఆర్‌ఎస్పీలో మొసళ్ల సంతతి గణనీయంగా పెరిగింది. జీవ వైవిధ్యంలో ముఖ్యమైన మొసళ్ల సంరక్షణపై అటవీశాఖ దృష్టి సారించింది. కొన్నేళ్లుగా వీఆర్‌ఎస్పీలో వీటి వేట, విషప్రయోగాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ వానలు లేకపోవడంతో వీటి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.


వర్షమే ఆధారం! 


వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌ నీటిసామర్థ్యం 0.389 టీఎంసీలు. ఇది వర్షాధార ప్రాజెక్ట్‌ కావడంతో సమృద్ధిగా వర్షపునీరు చేరడం లేదు. అరకొరగా చేరిన జలాలను కూడా ఆయకట్టు పంటలకు విడుదల చేసేవారు. దీంతో ఏటా వేసవిలో ప్రాజెక్ట్‌లో నీరు అడుగంటిపోతున్నందు వల్ల మొసళ్లకు జలగండం పొంచి ఉంది. ప్రస్తుతం వీఆర్‌ఎస్పీలోని కొద్దిపాటి నీరు కూడా బురదమయమైంది. నిజానికి ఇక్కడి మొసళ్లు మంచి నీటి సరస్సుల్లో జీవించే జాతికి చెందినవి. జలాశయంలో కనీసంగా నీరు లేకపోవడంతో వీటి ఉనికి సంక్షోభంలో పడింది. సుమారు 150 కేజీలకు పైగా బరువు, 5నుంచి6 అడుగుల పొడవు ఉన్న మొసళ్లివి. ప్రాజెక్ట్‌ జలాల్లోని చేపలు, ఎండ్రకాయలు, ఇతర జలచరాలను తింటూ జీవించేవి. ఇప్పుడు నీరు లేకపోవడంతో మొసళ్లకు ఆహార కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. జలాశయంలో నీరు లేకపోవడానికి తోడు వేసవి తాపానికి తల్లడిల్లుతున్నాయి. దీంతో మధ్యాహ్న వేళల్లో జలాశయంలో ఉండలేక ఒడ్డున సేదతీరుతున్నాయి. మూడేళ్ల క్రితం వీఆర్‌ఎస్పీలో ఇదే పరిస్థితిలో ఓ మొసలి మృతి చెందింది. ఆహార కొరత వల్లే అనారోగ్యానికి గురై మొసలి మరణించినట్లు అప్పట్లో అటవీ అధికారులు నిర్ధారిం చారు.  ఇప్పుడు కూడా  ఇలాంటి పరిస్థితే  ఎదురైనట్లు తెలుస్తోంది. 


ప్రశ్నార్థకంగా సంరక్షణ 


వీఆర్‌ఎస్పీలో మొసళ్ల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. జీవవైవిధ్య సంరక్షణలో భాగంగా అంతరించిపోతున్న మొసళ్ల జాతిని సంరక్షించాలని 1974లోనే ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. మనదేశంలో 1975 నుంచి మొసళ్ల సంరక్షణ చర్యలు చేపట్టి వాటి కోసం 8 సంరక్షణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే శ్రీశైలం జలాశయాన్ని కూడా మొసళ్ల సంరక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు. జీవ వైవిధ్య సమతౌల్యంలో భాగంగా ప్రతి పాణిని సంరక్షించాలన్నది అటవీశాఖ ముఖ్య ఉద్దేశం.    వీఆర్‌ఎస్పీలో నీరు లేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మొసళ్లను సంరక్షించడంలో అటవీ అధికారులు చేతులేత్తిసినట్లు విమర్శలు ఉన్నాయి.  మొసళ్ల సంరక్షణకై అటవీ అధికారులు ప్రాజెక్ట్‌ను నీటితో నింపడం... ఆహారం అందేలా చూడటం అసాధ్యం కూడా. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి  మొసళ్లను నీటి లభ్యత  ఉన్న మరోచోటికి తరలిస్తే ప్రయోజనం  ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2022-04-29T06:29:02+05:30 IST