వాహనదారులూ జాగ్రత్త... గుచ్చి గుచ్చి చూసే తనిఖీ విధానం రాబోతోంది...

ABN , First Publish Date - 2022-01-04T18:48:53+05:30 IST

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఓ

వాహనదారులూ జాగ్రత్త... గుచ్చి గుచ్చి చూసే తనిఖీ విధానం రాబోతోంది...

న్యూఢిల్లీ : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఓ నూతన తనిఖీల విధానాన్ని పరీక్షిస్తోంది. దీనిని అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) అని పిలుస్తారు. దీనిని ప్రస్తుతం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై పరీక్షిస్తోంది. త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎక్స్‌ప్రెస్‌వేలపైనా అమల్లోకి వస్తుంది. 


ఏటీఎంఎస్ విధానం వాహనాల నంబర్ ప్లేట్లను ఫొటో తీయడం మాత్రమే కాకుండా వాహనాల్లోని వ్యక్తులు సీట్ బెల్ట్ పెట్టుకున్నదీ, లేనిదీ కూడా అధికారులకు సమాచారం అందజేయగలదు. అదేవిధంగా చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇతర పత్రాలు ఉన్నాయో, లేదో కూడా తెలియజేస్తుంది. రవాణా శాఖ (ఆర్టీవో)లోని వాహన డేటాబేస్‌కు ఏటీఎంఎస్‌ను అనుసంధానం చేస్తారు. 


ATMSను ప్రస్తుతం ఎన్‌హెచ్ఏఐ అధికారులు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే, తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. చెల్లుబాటయ్యే పత్రాలు లేని వాహనాలను ఈ ATMS గుర్తిస్తుంది. చలానాలు జారీ చేయడం కోసం ఆ సమాచారాన్ని స్థానిక ట్రాఫిక్ పోలీసులకు అందజేస్తుంది. వాహనం నంబర్ ప్లేట్‌ను క్యాప్చర్ చేయడం ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతుంది. 


ATMSను RTO డేటాబేస్‌తో అనుసంధానం చేస్తారు కాబట్టి వాహనం బీమా, దాని వయసు, పొల్యూషన్ సర్టిఫికేట్, CNG కిట్ టెస్టింగ్ వంటివాటిని తెలుసుకుని, ఆ వివరాలను అధికారులకు తెలియజేస్తుంది. 


ఈ విధానం వల్ల ట్రాఫిక్ జామ్స్, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని NHAI అధికారులు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయడానికి బదులుగా, ఈ సిస్టమ్ చెప్పిన వాహనాలకు మాత్రమే చలానాలు జారీ చేస్తారని తెలిపారు. వాహనాలను ఆపకుండానే చలానాలను జారీ చేస్తారన్నారు. ఆ సొమ్మును ఆ తర్వాత వసూలు చేయవలసిన బాధ్యత స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ఉంటుందన్నారు. 


కమర్షియల్ వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్లను కూడా ఈ విధానం తనిఖీ చేస్తుందన్నారు. యాక్సిడెంట్లు, ఇతర నేరాలతో ప్రమేయంగల వాహనాలను కూడా ఈ విధానం గుర్తించి, తెలియజేస్తుందని చెప్పారు. 


అన్ని ఎక్స్‌ప్రెస్‌వేస్, నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవేలపై ఈ విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రస్తుత రోడ్లపై కూడా దీనిని అమర్చుతారు. 


Updated Date - 2022-01-04T18:48:53+05:30 IST