పాలకుల పాపం.. ఎడ్లంకకు శాపం

ABN , First Publish Date - 2021-08-04T06:11:05+05:30 IST

అవనిగడ్డ మండల పరిధిలోని పాత ఎడ్లంక గ్రామానికి ఉన్న ఏకైక రవాణా మార్గం ఎడ్లంక కాజ్‌ వే.

పాలకుల పాపం.. ఎడ్లంకకు శాపం
కాజ్‌వే కొట్టుకుపోవటంతో పడవలో నదిని దాటుతున్న ఎడ్లంకవాసులు

కొద్దిపాటి వరదకే కొట్టుకుపోయిన కాజ్‌వే


అవనిగడ్డ టౌన్‌, ఆగస్టు 3 : అవనిగడ్డ మండల పరిధిలోని పాత ఎడ్లంక గ్రామానికి ఉన్న ఏకైక రవాణా మార్గం ఎడ్లంక కాజ్‌ వే. ఇప్పుడది ఇక్కడ లేదు. మంగళవారం ఉదయం వచ్చిన కొద్దిపాటి వరదకే కొట్టుకుపోయింది. పర్యావరణ చట్టాలను బేఖాతరు చేస్తూ పాలకులు సాగిస్తున్న పర్యావరణ విధ్వంసమే ఇందుకు కారణం. ఒకనాడు పది లక్షల క్యూసెక్కుల వరదనీరు పోటేత్తినా ఏ మాత్రం చలించని ఈ ప్రాంత ప్రజలు నేడు రెండు లక్షల క్కూసెక్కుల వరద నీటికే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. ఇసుక, బుసక తవ్వకాలు అడ్డగోలుగా జరగడంతో నేడు ఈ ప్రాంతం పటుత్వాన్ని కోల్పోయింది. ఫలితంగా బయట ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం కూడా వీరికి లేకుండా పోయింది. ఈ ప్రాంత ప్రజలు వరదనీటిలోనే పడవలపై ప్రయాణిస్తూ తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. మంగళవారం ఉదయం పలువురు డిగ్రీ విద్యార్థులు పరీక్ష రాయటానికి గ్రామస్థుల సాయంతో  కూలిపోయిన కాజ్‌ వేపై నుంచి వరదనీటిని దాటుకుని వెళ్లాల్సి వచ్చింది. ఇళ్ల స్థలాల మెరక, అభివృద్ధి కార్యక్రమాల పెరుతో సీఆర్‌జెడ్‌ పరిధిలో తవ్వకాల కారణంగా నాగాయలంక, కొత్తపాలెం, ఎదురుమొండి, పాత ఎడ్లంక, దక్షిణచిరువోలులంక గ్రామాల్లోని పరివాహక ప్రాంతం కూడా కోతకు గురై ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా నియోజకవర్గం పరిధిలో ఇసుక, బుసక అక్రమ రవాణాను నిలిపివేసి, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఎడ్లంక ప్రాంతానికి కాజ్‌ వే నిర్మించాలని, కోతకు గురయ్యే ప్రాంతంలో వరద ప్రవాహాన్ని నిరోధించేలా చర్యలు చేపట్టాలని దివి ప్రాంతవాసులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-04T06:11:05+05:30 IST