అనారోగ్యం ఎందుకు?

ABN , First Publish Date - 2021-04-27T05:30:00+05:30 IST

శ్వాససంబంధమైన, జీర్ణసంబంధమైన, క్రిమిసంబంధమైన... ఇలా అనారోగ్యాలు మూడు రకాలుగా ఉంటాయి. శ్వాస సంబంధ క్రియలు సక్రమంగా జరగకపోవడం మూలంగా కండరాలు పట్టేయడం, గుండె దడ, ఊపిరితిత్తులు, రక్తసంబంధ సమస్యలు, ఆందోళన మొదలైన సమస్యలు...

అనారోగ్యం ఎందుకు?

శ్వాససంబంధమైన, జీర్ణసంబంధమైన, క్రిమిసంబంధమైన... ఇలా అనారోగ్యాలు మూడు రకాలుగా ఉంటాయి. శ్వాస సంబంధ క్రియలు సక్రమంగా జరగకపోవడం మూలంగా కండరాలు పట్టేయడం, గుండె దడ, ఊపిరితిత్తులు, రక్తసంబంధ సమస్యలు, ఆందోళన మొదలైన సమస్యలు మొదలవుతాయి. 


మన చుట్టూ ఉండే ఫంగస్‌, బ్యాక్టీరియా, వైరస్‌ క్రిములు నీరు, గాలి, ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకుని ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, అలర్జీలు కలిగిస్తాయి. ఆయుర్వేద వైద్య విధానంలో శరీర తత్వం ఆధారంగా చికిత్స చేయడం జరుగుతుంది. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించే వ్యవస్థల్లో ముఖ్యమైన శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థల్లో సమస్యలు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయేలా చేసి, అనారోగ్యానికి కారణమవుతాయి. ఫలితంగా తలెత్తే ఆరోగ్య సమస్యల్లో....


కండరాలు పట్టేయడం: కండరాల నొప్పులకు ముఖ్య కారణం శ్వాస సంబంఽధమైన సమస్య అని ఆయుర్వేదం చెబుతోంది. ఆక్సిజన్‌ గ్రహించే వ్యవస్థలో లోపం మూలంగా కండరాలకు ఆక్సిజన్‌ అందక, కండరాల పనితీరు నెమ్మదించి, కండరాలు పట్టేయడం, పిక్కలు, మెడ కండరాల నొప్పులు (స్పాండిలైటిస్‌) మొదలవుతాయి.

జీర్ణ వ్యవస్థ: వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోవడం వల్ల మలబద్ధకం, ఫలితంగా పైల్స్‌, ఫిస్టులా వంటి సమస్యలు వేధిస్తాయి. పొట్ట ఉబ్బరంతో వెన్ను మీద భారం పడి, కాళ్లకు రక్తసరఫరాలో అడ్డంకులు ఏర్పడి, కాళ్లనొప్పులు, నడుము నొప్పి మొదలవుతాయి. పుల్లని త్రేన్పులు, గుండెల్లో మంట, గుండె దడ లాంటి సమస్యలు కూడా ఉంటాయి.

చర్మ సమస్యలు: చర్మం ద్వారా బయటకు వెళ్లవలసిన వ్యర్థాలు శరీరంలోనే మిగిలిపోవడం వల్ల అలర్జీ, ఎగ్జీమా, సోరియాసిస్‌లు వస్తాయి. శ్వాస సంబంధ ఇబ్బంది కలిగినవాళ్లకు సోరియాసిస్‌ దీర్ఘకాలిక రోగంగా మారే అవకాశం ఉంది.

శ్వాస వ్యవస్థ: శ్వాస ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్లని పక్షంలో కఫ సంబంధ సమస్యలు మొదలవుతాయి. జలుబు, దగ్గులతో పాటు న్యుమోనియా, క్షయ లాంటి దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. కంటి సమస్యలు, జుట్టు రాలడం, తీవ్రమైన తలనొప్పి సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. జలుబు, దగ్గు, డస్ట్‌ అలర్జీలు కూడా వేధిస్తాయి. 

ఈ సమస్యలకు పరిష్కారంగా జీవనవిధానం, ఆహారపుటలవాట్లను సరిచేసుకోవాలి. రోగి శరీర తత్వం, అతని పూర్వీకుల ఆహారపుటలవాట్ల ఆధారంగా అవసరమైన ఆహారనియమాలు నిర్ణయించడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

- జి. శశిధర్‌, 

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల.


Updated Date - 2021-04-27T05:30:00+05:30 IST