Tirumala: మళ్లీ మొదలైన కాషన్‌ డిపాజిట్‌ విధానం

ABN , First Publish Date - 2021-08-06T07:09:34+05:30 IST

తిరుమలలో కాషన్‌ డిపాజిట్‌ విధానం..

Tirumala: మళ్లీ మొదలైన కాషన్‌ డిపాజిట్‌ విధానం

తిరుమల(ఆంధ్రజ్యోతి): తిరుమలలో కాషన్‌ డిపాజిట్‌ విధానం గురువారం నుంచి తిరిగి మొదలైంది. గతంలో రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె కలిగిన గదుల కోసం భక్తులు రూ.500 అదనంగా డిపాజిట్‌ చెల్లించాల్సి ఉండేది. అలాగే రూ.500 నుంచి రూ.6వేల వరకు అద్దె కలిగిన గదులకు అంతే మొత్తంలో డిపాజిట్‌ కట్టాల్సి ఉండేది. గదిని ఖాళీ చేసిన తర్వాత తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉండే కాషన్‌ డిపాజిట్‌ కౌంటర్ల వద్దకు వెళ్లి, గది ఖాళీ చేసినట్టు రసీదు చూపితే తిరిగి డిపాజిట్‌ సొమ్మును అందజేసేవారు. అయితే ఇదంతా భక్తులకు సమస్యగా ఉందని భావించి 2017లో కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని రద్దు చేశారు. ఈ కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించిన టీటీడీ గురువారం నుంచి ఆచరణలోకి తెచ్చింది. అయితే డిపాజిట్‌ విధానంలోని సమస్యలను దృష్టిలో పెట్టుకుని భక్తులు డిపాజిట్‌ సొమ్మును తిరిగి పొందేందుకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కొన్ని మార్పులు చేసింది.


ప్రస్తుతం తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో రూం రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు ఉన్నాయి. వీటిలో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న భక్తుల సెల్‌ఫోన్‌కు కేటాయించిన గది ఏరియా ఉప విచారణ కార్యాలయ వివరాలు అందుతాయి. ఈ ప్రాంతానికి చేరుకుని అద్దెను క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా నగదు చెల్లించి గదిని పొందాల్సి ఉంటుంది. ఈ విధానాన్నే కొనసాగిస్తూ ఆయా ఉప విచారణ కార్యాలయంలో భక్తులు అద్దెతోపాటు డిపాజిట్‌ చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అయితే కాషన్‌ డిపాజిట్‌ విధానం అమల్లోకి తీసుకొచ్చిన క్రమంలో డిజిటల్‌ పేమెంట్‌తోపాటు నగదుతో కూడా గదిని పొందేలా మార్పులు చేశారు. నగదు చెల్లించి గదిని పొందేవారికి డిపాజిట్‌ను నగదు రూపంలో ఇవ్వడంతో పాటు కార్డుల ద్వారా గదిని పొందే భక్తులకు డిపాజిట్‌ను తిరిగి వారి బ్యాంకు ఖాతాలోకి పంపేలా చర్యలు తీసుకున్నారు. 


భక్తులు ఇష్టపడితే హుండీ చిల్లర నాణేల అందజేత

శ్రీవారి ఆలయంలోని హుండీలో నోట్లతోపాటు చిల్లర నాణేలు కూడా కానుకలుగా వచ్చే విషయం తెలిసిందే. ప్రస్తుతం వాటిని లెక్కించి వివిధ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్‌ చేస్తోంది. అయితే గదికి డిపాజిట్‌ అందజేసే భక్తులు ఇష్టపడితే రీఫండ్‌గా హుండీ ద్వారా వచ్చే చిల్లర నాణేలను అందించే అంశంపై టీటీడీ ఆలోచన చేస్తోంది. శ్రీవారి హుండీలో వచ్చే కానుకలు కాబట్టి సెంటిమెంట్‌గా భక్తులు స్వీకరిస్తారని టీటీడీ భావిస్తోంది. తొలుత ఈ కాషన్‌ డిపాజిట్‌ విధానం విజయవంతమైతే తర్వాత చిల్లర నాణేలు అందించే అంశంపై టీటీడీ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-06T07:09:34+05:30 IST