మూగరోదన

ABN , First Publish Date - 2021-10-10T05:36:37+05:30 IST

మూగరోదన

మూగరోదన
వాహనంలో కుక్కి ఎక్కించిన పశువులు,

చర్ల కేంద్రంగా పశువుల అక్రమ రవాణా

కబేళాలకు నిత్యం వాహనాల్లో తరలింపు

కాళ్లు, మెడలు విరగ్గొడుతున్న వ్యాపారులు

చిత్రహింసలతో కన్నీరు పెడుతున్న మూగజీవులు

ఏజెన్సీలో అంతరించిపోతున్న సంపద

చర్ల, అక్టోబరు 9: పచ్చనిబయళ్లు.. కొండవాలుల్లో ఆహ్లాదంగా సంచరించాల్సిన పశువులు కనికరం లేని కొందరు కసాయిల ధనదాహంతో కబేళాల పాలవుతున్నాయి. కాళ్లు విరిచి.. మెడలు వంచి.. కాళ్లతో తొక్కి.. వ్యాన్లల్లో కుక్కిమరీ తరలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల కేంద్రంగా పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పగలు, రాత్రి తేడాలేకుండా కొంతమంది ఈ దందాను యథేచ్చగా సాగిస్తున్నారు. ప్రతీ గ్రామం నుంచి పశువులను సేకరించి వ్యాన్లు, ట్రాలీ ఆటోల్లో కుక్కి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని కబేలాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాటి కాళ్లు, నడుములు విరగ్గొట్టి మరీ వాటిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దెబ్బలు తగిలి, శరీరాలు ఛిద్రమై మూగజీవాలు అల్లాడిపోతున్నా కనికరం లేకుండా ప్రవర్శిస్తున్నారు. వాహనాల్లో కదలలేక, నీరు, ఆహారం అందక ప్రయాణంలోనే అనేక పశువులు మృత్యువాతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా అధికారులు పశువుల అక్రమ వ్యాపారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే విలువైన జంతు సంపద అంతరించిపోయే ప్రమాదముందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పశువుల ఆక్రమ వ్యాపారం ఇలా 

చర్ల మండలంతో పాటు, సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో పశుసంపద అధికంగా ఉంటుంది. దీన్ని గమనించిన కొంతమంది పట్టణ ప్రాంతానికి చెందిన ప్యాపారులు పశువుల అక్రమ వ్యాపారంపై కన్నెశారు. స్థానికంగా ఉండే కొందరిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని చర్ల, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఉన్న పశువులను కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వాటిని వందల కిలోమీటర్లు నడిపించి చర్ల మండలంలోని లక్ష్మీకాలనీ, తాలిపేరు ప్రాజెక్టు, లెలిన్‌ కాలనీ, సుబ్బంపేట గ్రామాలకు తీసుకొస్తున్నారు. 

వాహనాల్లో కుక్కి.. చిత్రహింసలు పెట్టి 

చర్ల మండలానికి తీసుకొచ్చిన ఆవులు, ఎడ్లు, గేదెలను ప్రత్యేకంగా తీసుకొచ్చిన డీసీఎం వాహనాల్లో ఎక్కిస్తున్నారు. సుమారు 6 పశువులు పట్టే వాహనంలో 20నుంచి 30పశువులను కుక్కుతున్నారు. పశువులు ఎక్కలేకపోతే వాటిని చిత్రహింసలు పెడుతున్నారు. కాళ్లు, మెడలను విరగ్గొట్టుతున్నారు. కనీసం వాటికి ఆహరం కూడా అందించడం లేదు. అనంతరం వాటిని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ములుగులోని జంగాలపల్లిలోని కబేలాలకు పంపిస్తున్నారు. ఒకవేళ మార్గంమధ్యంలో పశువులు చనిపోతే వాటిని అక్కడే పడేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్యాపారం జోరుగా సాగుతోంది మార్గంమధ్యంలో వాహనాలను ఎవ్వరూ ఆపకుండా ఉండేందుకు పంచాయతీల నుంచి అనుమతి తీసుకుంటున్నారు. ఒక్కో పశువుకు కొంత నగదు చెల్లిస్తున్నారు. 

అమలుకాని గత కలెక్టర్‌ ఆదేశాలు..

కొన్ని నెలల క్రితం పశువుల అక్రమ వ్యాపారంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. దీంతో స్పందించిన అప్పటి కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి అప్పటి ఆర్డీవోను విచారణకు ఆదేశించారు. అలాగే జిల్లా పశువైద్యుడిని కూడా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఆ ఇద్దరు అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్ల మండలంలోని సుబ్బంపేట, సీ కత్తిగూడెం వద్ద రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అప్పటి కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి నాటి చర్ల తహసీల్దార్‌ అనీల్‌కుమార్‌ను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆ చెక్‌ పోస్టులను అధికారులు ఏర్పాటు చేయలేదు.

కఠిన చర్యలు తీసుకుంటాం

నాగేశ్వరరావు, చర్ల తహసీల్దార్‌  

చర్ల మండలంలో సాగుతున్న పశువుల అక్రమ వ్యాపారంపై దృష్టి సారిస్తాం. నిఘా ఏర్పాటు చేసి వాహనాలను పట్టుకుంటాం. అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్‌ చేసి పశువులను గోశాలకు తరలిస్తాం. 



Updated Date - 2021-10-10T05:36:37+05:30 IST