Abn logo
Sep 19 2020 @ 00:00AM

పశుక్రాంతిపై పట్టింపు కరువు

Kaakateeya

జిల్లాలో తగ్గిపోతున్న పశు సంతతి

వ్యవసాయ రంగానికి గట్టి దెబ్బ

జిల్లాలో సాగుకు పనికొచ్చే పశువులు లక్ష లోపే

పాడి అభివృద్ధికి చర్యలు శూన్యం

గోపాలమిత్రలు లేరు.. కృత్రిమ గర్భధారణ లేదు

మొక్కుబడి కార్యక్రమాలతో చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పశుక్రాంతిపై పట్టింపు కరువైంది. సంప్రదాయ వ్యవసాయ రంగానికి పశువులే చోదక శక్తులు. అంతే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మల్లాంటి పాడి పశువులు నానాటికి అంతరించి పోతున్నాయి. కుమరంభీం జిల్లాలో పాడి అభివృద్ధి పక్కన పెడితే సాగు పనులకు పనికొచ్చే ఎద్దుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. జిల్లాలో ప్రస్తుతం లక్ష లోపే ఎద్దుల సంఖ్య ఉన్నట్లు అధికారిక గణంకాలే చెబుతున్నాయి. అనధికారి లెక్కల ప్రకారం వ్యవసాయానికి ఉపయోగ పడుతున్న పశువుల సంఖ్య 50 వేలకు మించి ఉండక పోవచ్చని అంచనా వేస్తున్నారు. పశువుల అభివృద్ధి కోసం నాలుగేళ్ల క్రితం వరకు పశుక్రాంతి పేరిట వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించినా వాటి ద్వారా రైతాంగానికి ఒనగూడిన ప్రయోజనం శూన్యం. ఈ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం మొక్కుబడిగా మమ అనిపించేసి చేతులు దులుపుకోవడంతో జిల్లాలో పాడి పశువులు మొదలుకుని గేదెల వరకు కబేళాలకు చేరుతున్నాయి. పాడి పశువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలేవి ఆచరణలో సత్ఫలితాలివ్వడం లేదన్నది పశుసంవర్ధక శాఖాధికారులు చెబుతున్న మాట. ఇందుకు ప్రభుత్వం కేటాయిస్తున్న అరకొర నిధులు, సరైన కార్యాచరణ లేక పోవడమే కారణమని అంటున్నారు.


యేటా ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో కంటి తుడుపు చర్యగా చేపడుతున్న చికిత్సా కార్యక్రమాలు మినహా పశువుల అభివృద్ధికి సిబ్బంది చేసిందేమీలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో పశు సంతతికి సోకే గాలికుంటు, చిటుకు రోగం, జబ్బవాపు, గుండవాపు వంటి సాధారణ చికిత్సలకే పరిమితమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. అటు గేదెలు, ఆవుల అభివృద్ధి కూడా లేక పోవడంతో దేశవాళి పాడి పశువులతో రైతులు అత్తెసరు ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు పాడి పశువులు ఎంతో కీలకమైనవి. ఈ క్రమంలో గత ప్రభుత్వాలు గోపాలమిత్ర పేరుతో ప్రతీ మండలానికి శిక్షణ ఇచ్చిన వలంటీర్లను నియమించారు. వారికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గోపాలమిత్రల వ్యవస్థ పూర్తిగా సుప్తచేతనావస్థకు చేరడంతో గ్రామాల్లో పశువుల మంచి చెడులు చూసే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో మొత్తం 15 మంది గోపాలమిత్రలను నియమించాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారి సేవలు కూడా అంతంత మాత్రమేనన్నది పశు సంవర్ధక శాఖాధికారుల వాదన. తాజాగా మరో సారి గోపాలమిత్రల నియమకానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. 


జిల్లాలో పశు సంపద పరిస్థితి..

కుమరం భీం జిల్లాలో మొత్తం రెండు పశువైద్య శాలలు, 19 డిస్పెన్సరీలు, ఏడు గ్రామీణ లైవ్‌ స్టాక్‌ యూనిట్లు, 14న గోపాలమిత్ర కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కాగా జేకే ట్రస్ట్‌ ద్వారా 39 గోపాలమిత్ర కేంద్రాల పరిధిలో 2.78 లక్షల పశు సంపద ఉంది. ఇందులో 0.51 లక్షల పాలిచ్చే గేదెలు ఉన్నాయి. ఇవి కాకుండా 0.83 లక్షల గొర్రెలు, 0.18 లక్షల మేకలు ఉన్నట్లు 2012 గణంకాలను బట్టి తెలుస్తోంది. అయితే ఇటీవల గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించినందున వాటి సంఖ్య పెరిగింది. అలాగే కోళ్లు 4,17,966, ఇతర జంతువులు 1300 కలుపుకుని మొత్తం 10,10,833 జంతువులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జరిపే సర్వే ద్వారా వెల్లడయ్యే గణాంకాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పాడి అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు అధికార యంత్రాంగానికి చెందిన విశ్వనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా షెపర్డ్‌ స్కీం అమలు దరమిళా వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాలన్న డిమాండ్‌ అధికంగా వినిపిస్తోంది.


మరీ ముఖ్యంగా సామాజికంగా వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్న కొన్ని వర్గాలకు రిజర్వేషన్‌ పరంగా ఎలాంటి ఫలాలు లభించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇతర వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల వ్యతిరేక భావనలు పొడచూపే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చేలా కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా పథకాలను ప్రారంభించే యోచనలో ఉంది. ముఖ్యంగా వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తే  దీనికి ప్రస్తుతం నిర్వహించే పశు గణన గణంకాలు కీలకమవుతాయి. 


జిల్లా విస్తీర్ణంలో..

జిల్లా విస్తీర్ణంలో 70 శాతం అటవీ ప్రాంతమే ఉన్నందున కుమరం భీం జిల్లాలో పశుగణాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసినట్లయితే జిల్లాలో శ్వేత విప్లవానికి నాంది ప్రస్తావన జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యవసాయ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పశు సంపద గణనీయంగా ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక పోవడంతో తక్కువ దిగుబడులతోనే రైతులు సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పశుగణాభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టినప్పటికీ ఏజెన్సీ ప్రాంతమైన కుమరం భీం జిల్లాకు వాటి ఫలాలు అందలేదన్న విమర్శలు ఉన్నాయి.


జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ తరువాత ఇక్కడ కొలువైన యంత్రాంగం జిల్లా అభివృద్ధికి, ఆదాయ వనరుల పెంపునకు అవసరమైన మార్గాలను అన్వేషించింది. ఈ క్రమంలో పూర్తి వ్యవసాయ ఆధారితమైన జిల్లాలో పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్న అంచనాతో మూడేళ్ల కోసం రూపొందించిన ప్రతిపాదనలను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం జిల్లా అధికారుల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తే త్వరలోనే జిల్లాకు పాలక సేకరణ కేంద్రం మంజూరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాదు గోపాలమిత్రల నియామకం పూర్తైతే ప్రస్తుతం ఉన్న దేశవాళి పశువులకు బదులు సంకరజాతి పశువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement