ధాన్యం డబ్బులకూ తిప్పలు

ABN , First Publish Date - 2021-06-14T05:23:51+05:30 IST

ధాన్యం డబ్బులకూ తిప్పలు

ధాన్యం డబ్బులకూ తిప్పలు
కులకచర్ల కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం

  • ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడక అవస్థలు పడుతున్న రైతులు 
  • పట్టించుకోని అధికారులు


కులకచర్ల: మండలంలోని సొసైటీ, ఐకేపీ, డీసీఎంఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన వరిధాన్యానికి సకాలంలో డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని విక్రయించి 20రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలేదు. ఈ ధాన్యానికి రావాల్సిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో తాము ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  మండలంలోని 23 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించారు. ఉన్నతాధికారులు స్పందించి రావాల్సిన డబ్బులు వెంటనే ఇప్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

అప్పులే మిగిలేలా ఉన్నాయి 

 కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మిన ధాన్యానికి కూడా డబ్బులు ఖాతాలో జమకాకపోవడంతో బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. అన్నిలెక్కలు చూసుకుంటే పెట్టిన పెట్టుబడులు పోనూ అప్పులే మిగిలేలా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. సొసైటీ పరిధిలో 7 కేంద్రాల్లో 250మంది రైతులకు రూ.2కోట్లా 50లక్షలు రావాల్సి ఉంది. 12 ఐకేపీ కేంద్రాల్లో 510మంది రైతులకు రూ.3 కోట్లా 50లక్షలు రావల్సి ఉంది. నాలుగు డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో 238 మంది రైతులకు రూ.4కోట్లు రావాల్సి ఉంది.  సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

20రోజులు అవుతున్నా డబ్బులు రాలేదు: ఆంజనేయులు, రైతు చాపలగూడెం

20రోజుల క్రితం కులకచర్ల కొనుగోలు కేంద్రంలో 19 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించారు. ఇప్పటికీ డబ్బులు ఖాతాల్లో జమ కాలేదు. ధాన్యం మిల్లులకు చేరిన తరువాత డబ్బులు వస్తాయని అధికారులు అంటున్నారు. ఖాతాల్లో ఎప్పుడు జమచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.     

ధాన్యాన్నంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్నం మైపాల్‌రెడ్డి

దోమ: రైతులు పండించిన ప్రతి చివరి గింజా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్నం మైపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పాలెపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ రైతు వెంకటయ్యకు చెందిన వడ్లు తడిసి మొలకెత్తడంతో బాధిత రైతుకు ఆర్థిక మైపాల్‌రెడ్డి సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మనస్తాపంతో ధాన్యంబస్తాలను తగలబెట్టే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కొనుగోలు కేంద్రంలో తాలుక, సెంటర్‌ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రతి రైతు దగ్గర 4-5 కిలోల కోత విధించనున్నట్లు తెలిపారు. అలాంటి రైతులకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ప్రత్యేకచర్యలు తీసుకోవాలన్నారు. కోతలు విధించిన రైతులకు నష్టపరిహారం అందించకుంటే కలెక్టరేట్‌ల ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రత్యేకచర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, మండల నాయకులు భాస్కర్‌, యాదయ్య, మేకల నర్సింహులు పాల్గొన్నారు.

రైతును మోసం చేస్తే కోర్టుకు లాగుతాం: రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశ్య పద్మ

తాండూరు: రైతులను మోసం చేస్తే ఎటి ్ట పరిస్థితుల్లో సహించమని, మోసం చేసే వారిని కోర్టుకు లాగుతామని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పాశ్యపద్మ హెచ్చరించారు. ఆదివారం రైతు సంఘం రాష్ట్ర నాయకులు శాస్త్రి, సంధ్యలతో కలిసి తాండూరులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అమ్మకానికి వచ్చిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాలాలం పేర్కంపల్లి గ్రామానికి వెళ్లే వరిఽధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, కోత ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేపట్టినప్పుడు ఒక్కోరైతు వద్ద ఒక్కోరకంగా కోత విధిస్తున్నారని, వే బిల్లు వద్ద ఒక్క రేటు ఉందని రైతులు వివరించారు. రైతును రాజు చేస్తామని రైతులకు అన్యాయం చేస్తున్నారని పాశ్య పద్మ ఆరోపించారు. రైతుధాన్యం కటింగ్‌పై కొనుగోలు పత్రం(రశీదు)లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. కలెక్టర్‌ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

సాగుకు సన్నద్ధం

మోమిన్‌పేట: గతవారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మండలంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు న్నాయని వాతావరణ శాఖ సూచిస్తుండటంతో రైతులు భూములను చదును చేసి విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు. మోమిన్‌పేట మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు పొలాల్లో పత్తి, కంది, మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే విత్తనాలు వేయడానికి కూలీలు రాక పలువురు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఒకేసారి దుక్కులు దున్నడంతో ట్రాక్టర్లకుసైతం డిమాండ్‌ బాగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ పనులను వ్యవసాయ పనులకు ఉపయోగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయాగ్రామాల రైతులు కోరుతున్నారు. 

ధారూరు మండలంలో..

ధారూరు: తొలకరి వర్షాలు కురుస్తుండటంతో పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. వివిధ రకాల పంటల విత్తనాలు విత్తేపనిలో రైతులు నిమగ్నమయ్యారు. తక్కువ మోతాదులో వర్షాలు కురిసినా మృగశిర కార్తె బిగులో విత్తిన పంటకు పురుగుండదని, పంటలు అధిక  దిగుబడులు వస్తాయనే నమ్మకంతో రైతులు  పెసర, కంది, మొక్కజొన్న, పత్తి, మినుము పంటలను రైతులు విత్తుతున్నారు. వర్షాలు కురువకుంటే విత్తనాలు సరిగ్గా మొలకెత్తవని, భూములు బాగా తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-06-14T05:23:51+05:30 IST