ష్‌... క్యాట్‌ ఫిష్‌..

ABN , First Publish Date - 2022-07-27T05:58:08+05:30 IST

ప్రభుత్వం క్యాట్‌ఫిష్‌ పెంపకాన్ని నిషేధించింది. అయినా వీటి పెంపకాలు ఆగలేదు. పెద్దాపురం పట్టణ పరిధిలోని గుడివాడ వెళ్లే రహదారిలో రహస్యంగా ఐదెకరాల్లో వీటిని పెంచుతున్నారు. క్యాట్‌ఫిష్‌ పెంపకాన్ని కొంతమంది అక్రమార్కులు రహస్యంగా కొనసాగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.

ష్‌... క్యాట్‌ ఫిష్‌..

కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్‌ఫిష్‌ను ప్రభుత్వం నిషేధించినా చాటుమాటుగా పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. కొన్నిచోట్ల కొర్రమీను పేరుతో హొటళ్లలో ఆహార పదార్థాలు విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండడం అనేక అనర్థాలకు దారితీస్తోంది. చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్‌ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు.


పెద్దాపురం, జూలై 26: ప్రభుత్వం క్యాట్‌ఫిష్‌ పెంపకాన్ని నిషేధించింది. అయినా వీటి పెంపకాలు ఆగలేదు. పెద్దాపురం పట్టణ పరిధిలోని గుడివాడ వెళ్లే రహదారిలో రహస్యంగా ఐదెకరాల్లో వీటిని పెంచుతున్నారు. క్యాట్‌ఫిష్‌ పెంపకాన్ని కొంతమంది అక్రమార్కులు రహస్యంగా కొనసాగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే వీరికి ఏమాత్రం లెక్కలేనట్టు కనిపిస్తోంది. వీటిని ఆహారంగా తీసుకుంటే ప్రమాదమని ప్రభుత్వం వీటి పెంపకాన్ని గతంలో పూర్తిగా నిషేధించింది. కొంతమంది అక్రమార్కులు ఈ క్యాట్‌ఫిష్‌ పెంపకంపై దృష్టిసారించారు. వీరికి ఫిషరీస్‌ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖలో పనిచేసే కొంతమంది అధికారుల అండదండలతోనే వీటిని పెంచుతున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చి వీళ్లు చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులకు వీటి పెంపకం బాధ్యతలు అప్పగించి తమపై ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. పదులసంఖ్య ఎకరాల్లో ఈ క్యాట్‌ఫిష్‌ పెంపకాన్ని చేపట్టినా ఫిషరీస్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలువురికి అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్యాట్‌ఫిష్‌ను తినడం ద్వారా ప్రజలు క్యాన్సర్‌ వంటి భయంకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.



యథేచ్ఛగా ఏలేరు జలాలు తోడేస్తున్నారు..

క్యాట్‌ఫిష్‌ పెంపకాలకు సంబంధించి చెరువులకు నీటి లభ్యత కావాల్సిన నేప థ్యంలో పెంపకందార్లు ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏలేరు జలా లను మోటార్ల సహాయంతో తోడేస్తున్నారు. దీంతో శివారు ప్రాంతాలకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరిగేషన్‌ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. పలువురు రైతులు కూడా తమకు చేపల చెరువుల కారణంగా నీరు అందడంలేదని చెబుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


క్వారీ గోతులే క్యాట్‌ ఫిష్‌ పెంపకాలకు అడ్డా..

పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన తర్వాత ఏర్పడిన భారీ గోతులే క్యాట్‌ఫిష్‌ పెంపకాలకు కూడా కొంతమంది అడ్డాగా మార్చేస్తున్నారు.   భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ క్వారీ గోతుల్లోకి నీరు సమృద్ధిగా చేరడంతో వాటిలో వీటిని పెంచుతున్నారు. 20అడుగుల మేర తవ్వకాలు సాగించడంతో క్వారీ గోతులు అగాధాలను తలపిస్తుండడంతో వాటిని పెంచేందుకు అనుకూలంగా ఉంటున్నాయి. పైగా రహస్యంగా మారుమూల ప్రాంతంలో ఉండడంతో అటువైపు అధికారుల సైతం వెళ్లలేని పరిస్థితి. దీంతో వీటి పెంపకం అక్రమార్కులకు వరంగా మారింది.  



క్యాట్‌ఫిష్‌కు బాగా డిమాండ్‌..

క్యాట్‌ఫిష్‌కు డిమాండ్‌ అధికంగా ఉండడంతో పలువురు వాటిని పెంచేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా పెంచిన క్యాట్‌ఫిష్‌ను ఎగుమతులు చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. పైగా అధికారులను ప్రలోభాలుకు గురిచేస్తూ వాటి పెంపకాన్ని ఇష్టానుసారం చేపట్టడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందని స్థానికులు చెబుతున్నారు. పైగా దాబాల్లో, హొటల్స్‌లో వీటితో చేసిన పదార్థాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు వాటిని గుర్తించలేక తినేస్తున్నారు. దీంతో రోగాలబారిన పడి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు క్యాట్‌ఫిష్‌తో తయారైన పదార్థాలు తిని అనారోగ్యం బారిన పడిన సందర్భాలు ఉన్నాయి.


యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు..

రహస్యంగా పెంచిన క్యాట్‌ఫిష్‌ను ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలించేస్తున్నారు. పైగా పబ్లిక్‌గా వాహనాల్లో వెళ్తున్నా సంబంధింత అధికారులు తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తృణమో, ఫలమో ముట్టచెప్పి అక్రమార్కులు వీటిని తరలించేయడంతో వారి అక్రమాలకు హద్దే లేకుండా పోయింది. ముఖ్యంగా వీటిని మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో వీటికి అధికంగా డిమాండ్‌ ఉండడంతో అక్రమార్కులు ఆ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది.


క్యాట్‌ ఫిష్‌ పెంపకాలపై నిషేధం ఉంది

క్యాట్‌ఫిష్‌ పెంపకాలపై నిషేధం ఉంది. ఎవరైనా వీటిని పెంపకం చేస్తే కఠిన చర్యలు తీసుకంటాం. ఫంగస్‌ రకం చేపలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఈ క్యాట్‌ ఫిష్‌ పెంపకంపై మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. నిషేధిత క్యాట్‌ ఫిష్‌ పెంపకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం.

-కె.ప్రకాశరావు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, పెద్దాపురం

Updated Date - 2022-07-27T05:58:08+05:30 IST