Abn logo
Oct 28 2021 @ 01:58AM

మార్పుకు మరో మెట్టు కులగణన

మార్క్సిజం ఒక డైనమిక్ సబ్జెక్ట్. అది ఒక యంత్రం కాదు. యంత్రాన్ని తయారు చేసి స్విచ్ నొక్కితే ఒక స్టాండర్డ్ ఔట్‌పుట్ వచ్చేస్తుంది. ఇక అందులో తేడాలేమీ ఉండవు. చాలా మంది మార్క్సిజం ఉపకరణాలను అన్వయించడం అంటే ఇందులో సోషియాలజీ, చరిత్ర లాంటివి వేటితో సంబంధం లేకుండా ఏక శిలా విధానాన్ని అన్వయించే పొరపాటు చేస్తూ ఉంటారు. సమాజాలు వేరు, సామాజిక నిర్మాణాలు వేరు, సామాజిక చరిత్రలు వేరు. ఇవన్నీ ఒకటే అయినప్పుడు -చారిత్రక భౌతికవాదం అనే ఒక శాస్త్రం లేదా ఒక ఉపకరణం అవసరం ఏముంది? ప్రిమిటివ్ సొసైటీలో వ్యక్తిగత ఆస్తి లేదు---, లోహం కనుక్కున్నాక ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది, ఉత్పత్తి సాధనాలు స్వంత ఆస్తి అయ్యాయి, ఆ స్వంత ఆస్తిని కాపాడుకోవడానికి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి బానిస సమాజం వచ్చింది, అక్కడి నుంచి భూస్వామ్య వ్యవస్థ, పిదప పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడింది-... అనేసి ఏకరీతి సిద్ధాంతం చేసుకుంటే - ఇక ఏ దేశ లేదా సమాజ గతి చలనం అయినా చదివే అవసరం ఏముంది? అందుకే తమకు తోచిన రీతిలో సమాజాన్ని అధ్యయనం చేసి తమకు అనుకూలంగా నడపడంలో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల కంటే బూర్జువా పార్టీలు తెలివైనవి .


మన దేశంలో తరాల నుంచి లింగ ఆధారిత జనాభా గణన జరుగుతోంది. కుల జనాభా గణన వద్దు అనుకునే మోనోలిథిక్ మార్క్సిస్టులు లింగ ఆధారిత జనాభా కూడా వద్దనాలి కదా? అంతిమంగా ప్రతి ఒక్కరు కార్మికుడు లేదా బూర్జువాగా ఉండాల్సిందే కదా? ఈ మార్క్సిస్టులు రాసే రాతల్లో గణాంకాలు ఏ మాత్రం ఉండవు. కొన్ని వాస్తవాలు గమనిద్దాం. ఎలక్ట్రానిక్ మీడియాలో సుమారు 121 న్యూస్ రూం పొజిషన్స్ ఉన్నాయి. అందులో 106 అగ్రకులాలవారు ఆక్రమించుకోగా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీల నుంచి ఏ ఒక్కరు కూడా లేరు. ఆక్స్ ఫాం ఇండియా అనే ఒక ఎన్‌జీవో సంస్థ జరిపిన సర్వేలో ప్రైం టైం డిబేట్ షోలకు ఆహ్వానితులయిన వాళ్ళు 70 శాతం అగ్రకులాలవాళ్ళే. గమనించాల్సింది ఏమంటే టీవీ చానల్స్ వారు ఎవరూ ‘నీ కులం ఏంటో ముందు చెప్పు, తర్వాత మా ప్రైం టైం చర్చకు రా’ అని అడగరు. అయినప్పటికీ ఇది జరుగుతోంది.


2020లో ఒక పార్లమెంటరీ కమిటీ (అది బూర్జువానో, పెట్టీ బూర్జువానో ఏదైతేనేం) ఢిల్లీ యూనివర్సిటీలో 1706 సాంక్షన్డ్ పోస్ట్‌లు ఉండగా, 79 మంది మాత్రమే ఓబీసీ సెక్షన్ నుండి ఉన్నారని గమనించింది. అంటే 5 శాతం కంటే తక్కువ. రిజర్వేషన్ అమలు చేయాలని యూనివర్సిటీ నిబంధనలుండగా కూడా ఇదే జరిగింది. ఇలా ఎందుకు జరుగుతోంది? మార్క్సిస్టుల ప్రకారం - కులం నిమిత్తం లేని బూర్జువా భూస్వామ్య వర్గం కదా అక్కడుండేది? ఎవరు కులం పేరు అడిగి వాళ్ళ టీచింగ్ సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు? ఇవన్నీ భౌతికమైన అస్పృశ్యత వల్ల జరగటం లేదు. ఎవరూ కులం అడిగి ఈ తారతమ్యాలు సృష్టించడం లేదు.

ఈ దేశంలో బూర్జువాలు, భూస్వాములు ఉన్నారని తమ మార్క్సిస్ట్ యంత్రంలో ముడిపదార్థాన్ని నింపేసుకున్న మోనోలిథిక్ మార్క్సిస్టులు –వేదాంత నుండి, హెటిరో డ్రగ్స్ నుండి, ఢిల్లీ నుండి కన్‌స్ట్రక్షన్ కంపెనీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ దాకా -ఎంతమంది దళిత బూర్జువాలు ఏర్పడ్డారో చెప్పగలరా? మన దేశంలో వ్యవసాయ భూమి విస్తరణ చూస్తే దళితుల్లో 60 శాతం పైగా రెండు హెక్టార్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళే. అదే ఎస్టీలలో 40 శాతం పైగా జనాలు 2 హెక్టార్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళే. అగ్రకులాలు, ఓబీసీ కులాలను గణాంకాలలో ‘ఇతరులు’లో కలిపేయడం వల్ల విడివిడిగా ఓబీసీ కులాల, అగ్రకులాల చేతిలో సగటు హోల్డింగ్ ఎంత అని తెలియడం లేదు. మొత్తానికి ఈ భూ పంపిణీలో కూడా కులం ప్రకారంగా విడగొట్టబడింది అన్నది ఇప్పటివరకు ప్రభుత్వం సంపాయించిన లెక్కల ప్రకారం ఓ నిజం. ఇక ఉత్పత్తి సాధనాలు, ఉత్పాదక వ్యవస్థ అగ్రకులాల చేతిలో ఉన్నప్పుడు, ఆ విషయం చెప్పకుండా మొత్తంగా కలగలిపి బూర్జువాలు అనడం మనకు అందని ఓ పూర్తిస్థాయి చిత్రం. ఈ దేశంలో ఇంతవరకూ జరిగింది వర్గగణనే.


అగ్రకులాలలో తమ పేదవర్గ నేపథ్యం నుంచి బయటపడిన సాహసోపేత గాథలు, దళిత పేద వర్గంలో ఎందుకు లేవు అని ఒక సాధారణ ప్రశ్న వేసుకుంటే - వర్గం బ్రేక్ అయ్యే పరిస్థితి ఉన్నా, కులం బ్రేక్ అయ్యే పరిస్థితి తక్కువే అని తెలుస్తుంది. బూర్జువా భూస్వామ్యవర్గంలో, మేధావివర్గంలో మొత్తం అగ్రకులాలే పాతుకుపోయినప్పుడు కార్మికవర్గ నియంతృత్వం ఏ కులం చేతిలో ఉంటుంది అనే ప్రశ్న అడగడంలో న్యాయం ఉన్నట్టే కదా? అంబేడ్కర్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను వ్యతిరేకించలేదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్, బీజేపీ కూడా వ్యతిరేకించవు. అయితే అంబేడ్కర్ అడిగిన సూటి ప్రశ్న ఏమంటే – రాబోయే కార్మికవర్గ నియంతృత్వం అంటే బ్రాహ్మణ వర్గానిదా? దళిత వర్గానిదా అని. డబ్బుకు రంగు లేదని అనుకుంటాము కానీ, మన దేశంలో ఉంది. డబ్బు అందరి చేతిలో ఒకటిలా లేదు. అది మనం పైన చూసిన చిన్న చిన్న గణాంకాల ద్వారా తెలుస్తుంది. కులం అన్నది మనసులో ఉండేది, భౌతిక అస్పృశ్యతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. కులం అన్నది నిర్మాణానికి సంబంధించిన విషయం కూడా. వైవాహిక వ్యవస్థ నుండి, పారిశ్రామికరంగం వరకు కంపార్టుమెంట్లుగా విడిపోయింది. ఈ కులనిర్మాణం మన దేశంలో వర్గంలా ఓపెన్ వ్యవస్థగా లేదు. ఇదో ‘క్లోజ్డ్’ నిర్మాణం. ఇందులో ఆర్థికవర్గంలా పదివేలు సంపాయించే వాడు లక్ష సంపాయించే స్ట్రాటాలోకి వెళ్లే విధంగా, కులంలో ఒక్కో మెట్టు ఎక్కడం ఉండదు. పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ పబ్లిష్ చేసిన పేపర్ Wealth Inequality, Class and Caste in India, 1961–2012 ప్రకారం అగ్రకులాలవారు భారతదేశ సగటు అదాయం కన్నా 47 శాతం ఎక్కువ ఆర్జిస్తున్నారు. కోటి రూపాయలు ఉన్న దళితుడు ఆర్థికంగా ఒకడుగు ముందుకు వేసి, ఒక ఆర్థికస్థాయి వరుసలో నిల్చోవచ్చు గాని, అదే ఆర్థికస్థాయి వరుసలో ఉన్న మిగతా కులాల సోషల్ కేపిటల్‌కు సమానస్థాయివాడు కాలేడు. 


అంతదాకా ఎందుకు? విప్లవ పార్టీలలో, కమ్యూనిస్టు పార్టీలలో అందరూ శ్రామిక దృక్పథం కలిగిన వాళ్ళే కదా అందులో దళితులు నాయకత్వ స్థాయి దాకా ఎందుకు ఎదగలేకపోయారు? కులం అన్నది స్ట్రక్చర్ లో భాగం. అందుకే దాని రూపాన్ని మోనోలిథిక్‌గా చెక్కలేము. ప్రత్యేకంగా అది ఏ స్ట్రక్చర్ అయినా సరే structural intervention అవసరం. మన దేశంలో ఈ పోలరైజేషన్ నిర్మాణం సూక్ష్మంగా అర్థం చేసుకోకపోతే మార్పు ఎటునుంచి మొదలు పెట్టాలన్నది అర్థం కాదు. ఈ దేశంలో 3000కు పైగా ఓబీసీ కులాలు ఉన్నాయి. ఈ రోజు క్యాస్ట్ డెప్త్ అన్నది అంతసులభంగా ఊహించేట్టుగా లేదు. లోతుపాతులు అర్థం కాకుండా బహుళ తారతమ్యాల భారతదేశ వర్గసమాజాన్ని అర్థం చేసుకోలేం. అందుకే ఈ దేశంలో ‘సోషల్ కేపిటల్’ ఏ విధంగా వర్గపరంగా చీలిపోయి ఉంది అన్నది మనం లెక్కలు బయటకు తీయాలి. వర్గాన్ని విభేద్యనీయమైన గుంపుగా కులం చేసింది. వర్గ నిర్మూలన జరగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు ఈ enclosureని అర్థం చేసుకోకపోతే, మార్క్సిజం ఆంజనేయ దండకం అవుతుంది. వాస్తవానికి మద్రాస్ హైకోర్టు కుల ఆధారిత గణాంకాలు తీయాలని తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టు కుల ఆధారిత గణాంకాలను తోసిపుచ్చింది. నిజానికి ఇది న్యాయవ్యవస్థకు సంబంధించిన సవాలు కాదు, పాలనాయంత్రాంగం బాధ్యత. ప్రభుత్వం కూడా టెక్నికల్ విషయాలను అడ్డుపెట్టి ఓబీసీలను విడగొట్టి గణాంకాలు తీయలేమని తేల్చి చెప్పింది. ఇప్పటివరకు ఓబీసీ గణాంకాలు అగ్రకులాలతో కలిసిపోయి ఉన్నాయి. ఆ 3000 కులాల నిర్మాణం కూడ బయటపడితే అగ్రకుల నియంతృత్వం ఎంత లోతుగా సాగిపోతోంది అన్నది తేటతెల్లం అవుతుంది. అది జరిగిన రోజు, ఎంత దారుణంగా ఈ దేశం ముక్కలు ముక్కలుగా విడిపోయ్యిందని తెలిసిన రోజు, దేశం మొత్తం సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. ఇన్నేళ్ళ స్వాతంత్ర్య వ్యవస్థ పేదలది అవునో కాదో గాని, మొత్తానికి అణగారిన కులాలది కాదు అని తెలిసొస్తుంది. ప్రతి అణగారిన కులంలో ఒక చైతన్య చలనాన్ని మనం గమనించే పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. ఏ వ్యవస్థా కూడా ‘కలెక్టివ్ రియలైజేషన్’కు లోను కావడానికి, సరి అయిన ‘మీన్స్’ ఉండాలి. అందుకు ఇటువంటి కుల గణాంకాలు తోడ్పడుతాయి. రిజర్వేషన్ల మాదిరిగానే ఇది ఒక ప్రధాన మెట్టు. కులం ఆధారంగా లెక్కలు తీయడంలో దానికి సంబంధించిన సంక్లిష్టతలు దానికి ఉన్నాయి. అయితే సూత్రప్రాయంగా దీని అవసరాన్ని గమనించకపోతే - సమతుల్య అభివృద్ధికి అర్థమే లేదు. ఆపై ఇక ఈ దేశం లో అందరూ జెనెటికల్ టెస్ట్‌లు చేయించుకుని ఆ టెస్ట్‌ల ప్రకారం వాళ్ళ వాళ్ళ వర్గాలు వాళ్ళవి అని డిసైడ్ అయిపోవాలి. ఇక మోనోలిథిక్ మార్క్సిస్టులు వర్గ రహితమైన బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని తయారు చేసుకోవడం కోసం తప్పుడు మంత్రాలు చదవాల్సిందే.


పి. విక్టర్ విజయ్ కుమార్‌ 

ప్రత్యేకం మరిన్ని...