బిహార్‌లో కులగణన?

ABN , First Publish Date - 2022-05-24T08:52:17+05:30 IST

కుల ప్రాతిపదికన జనగణన. దేశంలో ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్‌ ఇది.

బిహార్‌లో కులగణన?

కేంద్రం కుదరదన్నా.. నితీశ్‌ సన్నాహాలు

త్వరలో అఖిలపక్షం ముందుకు ప్రతిపాదన

సంకీర్ణంలో భాగమైనా.. దూరంగా బీజేపీ

ఇతర రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరిగే అవకాశం

లెక్కింపు జరిగితే రిజర్వేషన్లపై ప్రభావం!


పట్నా, మే 23: కుల ప్రాతిపదికన జనగణన. దేశంలో ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్‌ ఇది. జనాభా గణన కేంద్ర పరిధిలోని అంశమైనందున.. వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. కానీ, కేంద్రం ఇందుకు అంగీకరించడంలేదు. జనాభా లెక్కలు తీసిన ప్రతిసారీ ఎస్సీ, ఎస్టీల వారీగా, మతాల వారీగా ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని సేకరిస్తోందే తప్ప.. ఎవరెవరు ఏ కులంవారు అనే అంశాన్ని సేకరించడంలేదు. ఎప్పుడో బ్రిటిష్‌  కాలంలో 1931లో చివరిసారిగా కులాల వారీగా జనగణన చేపట్టారు. 1941లోనూ చేపట్టినా అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ తరువాత 1951లో ఈ అంశాన్ని పూర్తిగా రద్దు చేశారు.

కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీస్తే.. కుల సంఘాల నుంచి డిమాండ్లు, వివిధ కులాల నుంచి రిజర్వేషన్ల పరంగా కొత్త సమస్యలు వస్తాయని కేంద్రం భావిస్తోంది. వివిధ కులాలవారు జనాభాలో తమ సంఖ్య ఎంతో తేలితే వారి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలనో, ఇతర కులాల వారి రిజర్వేషన్‌ను తగ్గించాలనో డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కుల ప్రాతిపదికన జనగణనకు కేంద్రం అంగీకరించడంలేదు. కానీ, దేశ వ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో యూపీఏ-2 హయాంలో సామాజిక ఆర్థిక సర్వే పేరిట గణన చేపట్టారు. కానీ, సర్వే వివరాలను మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. మరోసారి అటువంటి ప్రయత్నమేదీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేయలేదు. కేంద్రం నిర్ణయాన్ని కూడా తోసిరాజని.. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ అంశాన్ని అఖిలపక్షం ముందు ఉంచుతామని, ఆ తర్వాత జనాభా లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అన్నారు. అయితే నితీశ్‌ పార్టీ జేడీయూతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాత్రం ఈ అంశంపై ఏమీ చెప్పకుండా దూరంగా ఉంటోంది. బిహార్‌లో కులగణనకు అంగీకారం తెలిపితే.. తమ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఇది సమస్యగా మారుతుందన్న ఆందోళన బీజేపీలో ఉంది.


నితీశ్‌కుమార్‌ బిహార్‌లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నా.. కొన్ని అంశాల్లో కాషాయ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నారు. లాలూప్రసాద్‌కు చెందిన ఆర్జేడీకి అనుకూలంగా నడచుకుంటున్నారు. ఇటీవల రంజాన్‌ సందర్భంగా ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వియాదవ్‌ ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో నితీశ్‌ పాల్గొన్నారు. తాజాగా కులగణన విషయంలోనూ తేజస్వియాదవ్‌ డిమాండ్‌ మేరకే నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు తేజస్వితోపాటు అఖిలపక్ష నేతలతో కలిసి ఈ అంశంపై ప్రధాని మోదీని కూడా కలిశారు. కేంద్రం కుదరదని చెప్పడంతో రాష్ట్ర పరిధిలో తామే లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు అయితే పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా కులగణనకు నితీశ్‌ మొగ్గుచూపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కులాల లెక్కలు తీస్తే.. బిహార్‌లో బీసీ సామాజికవర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారన్నది స్పష్టమవుతుందని, రెండు పార్టీలకు ఇది ప్రయోజనకరమని ఆ ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, బిహార్‌ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటే రాష్ట్రంలో నితీశ్‌ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది.


అయితే ఇదే జరిగితే బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్‌ తీసుకున్న ఈ నిర్ణయం బిహార్‌ వరకు పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల్లోనూ కులగణన చేపట్టాల్సిన తప్పనిసరి పరిస్థితులు తలెత్తవచ్చన్న కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అప్పుడు ప్రత్యేకించి అగ్రవర్ణాల నేతలు ఎక్కువగా నాయకత్వం వహిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని కాదని నితీశ్‌ పూనుకున్న ఈ చర్యను బీజేపీ అడ్టుకుంటుందా? బిహార్‌లో కులగణనను నితీశ్‌ పూర్తి చేసి.. ఇతర రాష్ట్రాలకు కూడా తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-05-24T08:52:17+05:30 IST