రెండూ పెరిగాయ్‌!

ABN , First Publish Date - 2020-10-06T06:39:51+05:30 IST

ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణితోపాటు డిజిటల్‌ లావాదేవీలూ పుంజుకున్నాయి. కరోనా సంక్షోభంతో ఆర్థిక భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది. దాంతో ప్రజలు అత్యవసరాల కోసం వీలైనంత ఎక్కువగా నగదు నిల్వ చేసుకుంటుండటంతో కరెన్సీ నోట్లకు డిమాండ్‌ పెరిగిందని...

రెండూ పెరిగాయ్‌!

  • ఈ-లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ పైపైకి 
  • ప్రీ- కొవిడ్‌ స్థాయికి డిజిటల్‌ చెల్లింపులు 
  • మార్చితో పోలిస్తే 13శాతం పుంజుకున్న కరెన్సీ చలామణి 


న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణితోపాటు డిజిటల్‌ లావాదేవీలూ పుంజుకున్నాయి. కరోనా సంక్షోభంతో ఆర్థిక భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది. దాంతో ప్రజలు అత్యవసరాల కోసం వీలైనంత ఎక్కువగా నగదు నిల్వ చేసుకుంటుండటంతో కరెన్సీ నోట్లకు డిమాండ్‌ పెరిగిందని 2019-20 వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరు 25 నాటికి వ్యవస్థలో చలామణి అవుతోన్న కరెన్సీ నోట్ల విలువ రూ.26,56,476 కోట్లు. గత ఏడాది సెప్టెంబరు 27 నాటికి చలామణిలో ఉన్న రూ.21,60,124 కోట్లతో పోలిస్తే 23 శాతం అధికం. ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న రూ.23,49,715 కోట్లతో పోల్చినా 13 శాతం ఎక్కువే. గత ఆర్థిక సంవత్సరంలో చలామణిలోకి వచ్చిన కరెన్సీ నోట్ల విలువ 14.7 శాతం, నోట్ల సంఖ్య 6.6 శాతం పెరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది. 


పుంజుకున్న డిజిటల్‌ చెల్లింపులు 

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు కరోనా సంక్షోభ పూర్వ (జనవరి-ఫిబ్రవరి) స్థాయికి పుంజుకున్నాయ ని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం.. సెప్టెంబరులో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ప్లాట్‌ఫామ్‌ ద్వారా రూ.3.29 లక్షల కోట్ల విలువైన 180 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. ఆగస్టులో నమోదైన రూ.2.98 లక్షల కోట్ల విలువైన 161 కోట్ల లావాదేవీల కంటే గణనీయంగా పెరిగాయి. గత నెలలో ఇమ్మీడియెట్‌ పేమెంట్‌ సర్వీసె్‌స (ఐఎంపీఎస్‌) ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం రూ.2.48 లక్షల కోట్ల విలువైన 2.79 కోట్ల లావాదేవీలు జరిగాయి. గతనెల భారత్‌ బిల్‌ పే ద్వారా రూ.3,920.83 కోట్ల విలువైన 2.31 లక్షల లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఈ సెప్టెంబరు చివరి నాటికి డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ట్రాన్సాక్షన్లు సైతం ప్రీ-కొవిడ్‌ స్థాయికి చేరుకుని ఉంటాయని బ్యాంకింగ్‌ వర్గాలంటున్నాయి. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దాంతో, ఈ-కామర్స్‌ సైట్లకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 


50 శాతం పెరిగిన నగదు చలామణి

2016 నవంబరు 8న మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను (రూ.500, రూ.1000) రద్దు చేసిన విషయం తెలిసిందే. నల్లధనం ఏరివేతతో పాటు ప్రజలు నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు డిజిటల్‌ చెల్లింపులకు ఊతమివ్వడమూ పెద్ద నోట్ల రద్దు లక్ష్యాల్లో ఒకటి. నల్లధన నిర్మూలనే కాదు, కరెనీ వాడకాన్ని తగ్గించే విషయంలోనూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లుగా కన్పించడం లేదు. ఎందుకంటే, 2016 నవంబరు 4 నాటికి వ్యవస్థలో చలామణి అవుతున్న కరెన్సీ విలువ రూ.17,74,187 కోట్లు. దాదాపు నాలుగు ఏళ్లలో (ఈ సెప్టెంబరు 25 నాటికి) కరెన్సీ చలామణి 49.73 శాతం పెరిగింది. 


Updated Date - 2020-10-06T06:39:51+05:30 IST