సమగ్ర దర్యాప్తుతో కేసులు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-19T03:58:06+05:30 IST

సమగ్ర దర్యాప్తుతో కేసులు పరిష్కరించాలి

సమగ్ర దర్యాప్తుతో కేసులు పరిష్కరించాలి
హాజరైన పోలీసులు, మాట్లాడుతున్న ఎస్పీ రాధిక

- ఎస్పీ జీ.ఆర్‌ రాధిక

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: అపరిష్కృత కేసులు, హత్య, హత్యాయత్నం, వరకట్నం, ఆస్తి, మహిళలపై జరిగే  నేరాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కేసులు పరిష్కరించాలని ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సర్కిల్‌ వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాపర్టీ, క్రైమ అగైనెస్ట్‌ ఉమెన్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.  హత్య, పోక్సో, రేప్‌, క్రైమ్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌, ప్రాపర్టీ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరనివారణ కోసం సబ్‌డివిజన్‌ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలన్నారు. నైట్‌ బీట్స్‌ బలోపేతం చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణ, ఛార్జీషీటు దాఖలు వరకు లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. నేర నివారణకు, నేరస్థుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. అన్ని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యాంకులు, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.  ఇంటిగ్రేటెడ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ డేటాబేస్‌ (ఐఆర్‌ఏడీ) ద్వారా రోడ్డు ప్రమాదాల డేటాను పరిశీలించాలన్నారు. ప్రమాదాల జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్‌) టీపీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు ఎం.మహేంద్ర, ఎస్‌.బాలరాజు,  సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 


ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలను ఉపయోగించుకోవాలి

 జిల్లా పోలీసు శాఖ అందిస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్‌(లాక్‌డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం) సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జీఆర్‌ రాధిక ఒక ప్రకటనలో కోరారు. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లేవారు ఆ ఇంటి చిరునామా వివరాలను జిల్లా పోలీసు వాట్సాప్‌ నంబర్‌ (6309990933)కు పంపించాలన్నారు. ఆ ఇంటి వద్ద  కెమెరాలను అమర్చడంతో పాటు గస్తీ పెంచి భద్రత కల్పిస్తామని చెప్పారు.   వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. 

Updated Date - 2022-08-19T03:58:06+05:30 IST