రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా.. తీవ్రత తక్కువే!

ABN , First Publish Date - 2022-06-25T08:53:11+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో పదుల సంఖ్యలో నమోదైన రోజువారీ పాజిటివ్‌లు ఇప్పుడు 500కు చేరాయి.

రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా.. తీవ్రత తక్కువే!

కేసులు వస్తున్నా తీవ్రత తక్కువే!

లక్షణాలు స్వల్పం.. 2-3 రోజుల్లో రికవరీ..

ఒక శాతం లోపునే ఆస్పత్రుల్లో చేరికలు

తాజా పాజిటివ్‌లలో మరణాలు శూన్యం

ఒమైక్రాన్‌ ఉప వేరియంట్లతోనే కేసులు

కొత్త వేరియంట్లు వస్తేనే నాలుగో వేవ్‌!

స్పష్టం చేస్తున్న వైద్య రంగ నిపుణులు

రాష్ట్రంలో కొత్తగా 493 కొవిడ్‌ కేసులు..!


హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో పదుల సంఖ్యలో నమోదైన రోజువారీ పాజిటివ్‌లు ఇప్పుడు 500కు చేరాయి. జూన్‌ 1 నుంచి 4,280 కేసులు నమోదయ్యాయి. 20 జిల్లాల్లో 20 రోజులుగా వ్యాప్తి రేటు పెరుగుతున్నట్లు వైద్యశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నెల 1వ తేదీన 0.59గా ఉన్న పాజిటివిటీ  శుక్రవారం నాటికి 1.69కు చేరింది. ఇక యాక్టివ్‌ కేసులు 3 వేలు దాటాయి. దీంతో ఇదేమైనా నాలుగో వేవ్‌కు సంకేతమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? తీవ్రత ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వైద్య నిపుణులు మాత్రం ఆందోళన అవసరం లేదంటున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఇది తాత్కాలికమేనని.. మరో వేవ్‌ దాకా రాకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు నమోదవుతున్న పాజిటివ్‌లన్నీ ఒమైక్రాన్‌ ఉప వేరియంట్లు బీఏ2.1, బీఏ4, బీఏ5 వల్లేనని, కొత్త వేరియంట్లతో కాదని వివరిస్తున్నారు. ఏదైనా కొత్త వేరియంట్‌ ఉంటేనే నాలుగో వేవ్‌ వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.


3 రోజుల్లోపే రికవరీ

ప్రస్తుతం బాధితుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా జ్వరం, జలుబు ఉంటోంది. దాంతోపాటు గొంతు, తల, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. కొందరిలో కడుపునొప్పి, విరేచనాలు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చినవారు కొంచెం నీరసంగా ఉంటున్నారు. గతంలో ఐదు రోజుల తర్వాత లక్షణాలు కనిపించేవి. కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టేది. ప్రస్తుత కేసుల్లో 2-3 రోజుల్లోనే రికవరీ అవుతున్నారని.. అదికూడా లక్షణాల ఆధారంగా వాడే మందులతోనే బయటపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల చేరికలు ఒక శాతమే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం కొవిడ్‌తో 40 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో అత్యధికులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే. మరోవైపు ఆరోగ్యం విషమించి ఐసీయూ, వెంటిలేటర్‌ మీదకు వెళ్లేంత తీవ్రత లేదు. మరణాలు శూన్యం.


కొత్త కేసులు 493.. 

రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 90 శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే వస్తున్నాయి. ఈ జిల్లాల్లో వ్యాప్తి రేటు వరుసగా 3.62, 2.98, 1.93గా ఉంది. ఇక శుక్రవారం 29,084 టెస్టులు చేయగా 493 మందికి కరోనా నిర్ధారణ అయింది. వరుసగా రెండో రోజూ 400 కేసులు వచ్చాయి. హైదరాబాద్‌లోనే 366 నమోదయ్యాయి. మేడ్చల్‌లో 34, రంగారెడ్డిలో 40, హనుమకొండలో 8, భద్రాద్రి కొత్తగూడెంలో 7 రికార్డయ్యాయి. 219 మంది కోలుకున్నారు. 3,332 యాక్టివ్‌ కేసులున్నాయి. శుక్రవారం 18605 మంది టీకా తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. 


గాంధీలో ఆరుగురే రోగులు.. ఆరోగ్యం నిలకడ

ప్రస్తుతం ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల చేరికలు లేవు. గాంధీలో ఆరుగురే రోగులున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. లక్షణాలు కనిపిస్తే  వెంటనే టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్‌ అని తేలిన తర్వాత అయాసం ఉన్నా, ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాస్కులు ధరించాలి. .

- డాక్టర్‌ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌


ఆందోళన అవసరం లేదు

కేసులు పెరుగుతున్నప్పటికీ నాలుగో వేవ్‌రాదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ డీఎంహెచ్‌వోలను అప్రమత్తం చేశాం. పరీక్షలు, నిఘా పెంచాం. టెస్టు, ట్రాక్‌, ట్రీట్మెంట్‌, టీకాతో పాటు కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సంసిద్ధం చేస్తున్నాం. ఔషధాలను అందుబాటులో ఉంచాం. సీజనల్‌ వ్యాధులు, కొవిడ్‌ లక్షణాలు రెండు ఒకేలా ఉంటాయి. లక్షణాలున్నవారు వెంటనే టెస్టులు చేయించుకోవాలి. 12-17 ఏళ్ల పిల్లలంతా తప్పనిసరిగా టీకా పొందాలి. 

 డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు


ఆరోగ్యం విషమించేంత తీవ్రత లేదు

ప్రస్తుతం కొవిడ్‌ రోగుల్లో ఐసీయూ వరకు వెళ్లేంత తీవ్రత కనిపించడం లేదు. యాంటీబయాటిక్స్‌ కూడా వాడడం లేదు. కాక్‌టెయిల్‌ ఇంజక్షన్లు, రెమ్‌డెసివిర్‌ వంటివి వాడే అవసరమే కనిపించడం లేదు. టీకా సింగిల్‌ డోసు కూడా తీసుకోనివారు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివారికి పాజిటివ్‌ వచ్చి లక్షణాలు తీవ్రంగా ఉంటే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ తీసుకోవాలి. 2 డోసులు వేయించుకుని 9 నెలలు గడిస్తే బూస్టర్‌ పొందాలి. మూడో డోసు పొంది 9 మాసాలైతే నాల్గో డోసు తీసుకోవచ్చు. 

-డాక్టర్‌ గెల్లా విశ్వనాథ్‌, ఏఐజీ ఆస్పత్రి, హైదరాబాద్‌ 

Updated Date - 2022-06-25T08:53:11+05:30 IST