సీబీఐపైనే కేసులా?

ABN , First Publish Date - 2022-05-13T08:42:37+05:30 IST

బాబాయిని చంపగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమేనని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

సీబీఐపైనే కేసులా?

  • కడప విడిచిపోకపోతే బాంబులేస్తామని బెదిరింపులు
  • బాబాయిని చంపగలిగే ఏకైక నేత
  • గొడ్డలిపోటును గుండెపోటుగా 
  • మార్చి చెప్పేదీ ఈయనే... జగన్‌పై బాబు ఫైర్‌
  • ఈ సీఎం వచ్చాక అత్యాచారాలు పెరిగాయ్‌
  • విచ్చలవిడిగా డ్రగ్స్‌, గంజాయి వల్లే ఘోరాలు
  • ప్రజల బాధ ఈయనకు పట్టదు
  • చాలామంది ముఖ్యమంత్రులను చూశాను
  • ఇంత బరితెగించిన సీఎంను చూడలేదు
  • ఊరికో సైకోను తయారుచేశాడు
  • కుప్పం నుంచే ప్రజాఉద్యమం రావాలి: బాబు


గుడుపల్లె, మే 12 (ఆంధ్రజ్యోతి): బాబాయిని చంపగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమేనని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గొడ్డలి పోటును గుండె పోటుగా మార్చి చెప్పగలిగే నాయకుడు కూడా అతనొక్కడేనన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన గురువారం రెండో రోజు పర్యటించారు. గుడుపల్లె మండలం పొగురుపల్లెలో మాట్లాడారు. ‘వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐపైనా కేసులు పెడుతున్నారు. కడప జిల్లా వదిలి వెళ్లకుంటే బాంబులేస్తామని బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పనికిమాలిన పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోలేకపోతోంది. పోలీసు వ్యవస్థపై  నాకు గౌరవం ఉంది. కానీ కొందరు పోలీసులు అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ మూర్ఖుడు (జగన్‌) వచ్చాక రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. తాజాగా ఆయన సొంత జిల్లా ప్రొద్దుటూరులో ఓ ఎస్సీ మహిళను పది మంది కలిసి అత్యాచారం చేస్తే పోలీసులు పట్టించుకోలేదు.


రాష్ట్రంలో రోజుకో చోట ఇలాంటి అత్యాచార అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా డ్రగ్స్‌, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండడంతో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి’ అని ఆందోళన వ్యక్తంచేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచుకోవాలని.. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరగడం సహజమని మహిళా హోం మంత్రి చెప్పడం దారుణమన్నారు. 


కరెంటు బిల్లులు రెట్టింపు చేశారని.. అలా పెంచాలన్నా ధైర్యం కావాలని, అలాంటి ధైర్యం ఉండే మూర్ఖుడు జగన్‌ ఒక్కడేనని ధ్వజమెత్తారు. ‘ప్రజల బాధ పట్టదు. లెక్కలేనితనం.. నేను చాలామంది సీఎంలను చూశాను. జగన్‌లా బరితెగించిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఈ సంవత్సరం అమ్మఒడి వేయలేదు. నేను పుట్టకముందు నుంచీ విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు ఇస్తున్నారు. ఈయన తానేదో కొత్తగా ఉద్ధరిస్తున్నట్లు విద్యా దీవెన, వసతి దీవెన పేర్లతో తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాడు. దాన్ని మళ్లీ విద్యాసంస్థలకు చెల్లించాలి. తల్లుల ఖాతాల్లో వేయడంతో ఆ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్మార్గుడి విధానాల వల్ల తెలివైన విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఏటా జాబ్‌ కేలెండర్‌ ప్రకటిస్తానని.. జాబ్‌లెస్‌ కేలెండర్‌ చేశాడు. నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు.


12 శాతం పూర్తి చేయలేనివాడు.. 

పెండింగ్‌లో ఉన్న 12 శాతం హంద్రీ-నీవా పనులు పూర్తి చేయలేదు గానీ.. మూడు రాజధానులు నిర్మిస్తాడంట అంటూ జగన్‌ను చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘అమరావతిని నాశనం చేశారు. పోలవరం నీళ్లను కృష్ణా, పెన్నా నదులకు తెస్తే రాష్ట్రంలో కరువు అనే పదం వినిపించదు. నదుల అనుసంధానం నా కల. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చయాలని ముందడుగు వేస్తే, చివరికి పోలవరాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్‌. ఊరికో సైకోను తయారుచేశాడు. కుప్పం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం రావాలి’ అని పిలుపిచ్చారు. పేదలకు తాను అన్న క్యాంటీన్‌ ద్వారా రూ.5కే భోజనం పెట్టానని చంద్రబాబు గుర్తుచేశారు. చేతనైతే జగన్‌ రూపాయికే పెట్టాలి కానీ క్యాంటీన్లే లేకుండా చేసి పేదల కడుపు కొట్టడం బాధాకరమన్నారు. తాను పెళ్లికానుక రూ.50 వేలు ఇస్తే రూ.లక్ష ఇస్తానని చెప్పిన జగన్‌.. రద్దు చేసేశాడని విమర్శించారు.


మున్సిపల్‌ ఎన్నికల్లో తప్పు జరిగింది 

‘మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పంలో చిన్న తప్పు జరిగింది. వెయ్యి, రెండు వేలకు ఆశ పడి కొందరు కాస్త పొరపాటు చేశారు. దానిని ఆసరాగా చేసుకుని జగన్‌ నన్ను మాటిమాటికీ అవహేళన చేస్తున్నాడు. కుప్పం ప్రజల నిజాయితీ గురించి ప్రపంచమంతా ప్రచారం చేశాను. చివరికి ఎన్నికల ఫలితాలతో ఆ నిజాయితీకి మచ్చ పడింది. ఇందులో నా లోటు కూడా ఉంది. మూడు నెలలకోసారి వచ్చి నేతలతో సమన్వయం చేసుకుని, మిమ్మల్ని కలిసి ఉంటే బాగుండేది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పొగురుపల్లెలో సుమారు 30 మంది యువకులు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. 


ద్రవిడ వర్సిటీ విద్యార్థుల ఫిర్యాదు

కుప్పం నుంచి పొగురుపల్లెకు వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్‌ను ద్రవిడ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు, సిబ్బంది ఆపారు. యూనివర్సిటీ తన అత్తగారి సొత్తులా రిజిస్ట్రార్‌ వేణుగోపాల్‌రెడ్డి భావించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వర్సిటీ ఆవరణలో వైసీపీ నేతలు క్వారీలు నిర్వహిస్తుండడం తెలిసీ అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోయారు. వర్సిటీలో వసతులు లేవని, కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం లేదని, ఫుడ్‌ పాయిజన్‌ అయినా ఇంతవరకు కారణాలు చెప్పలేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు జీతాలు పెంచడం లేదని కుప్పంలోని షాహీ గార్మెంట్స్‌ కార్మికులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారంతో ఆయన మూడ్రోజుల పర్యటన ముగుస్తుంది. 

Read more