Abn logo
Feb 21 2020 @ 04:56AM

ఎమ్మార్వోను అడ్డగించిన.. 400 మంది రైతులపై కేసులు

నిరసనగా రోడ్లపైకి వచ్చిన మహిళలు

అదేసమయంలో ఎమ్మెల్యే రోజా  రావడంతో తీవ్ర ఉద్రిక్తత

రైతులను కించపరుస్తారా? అంటూ నిలదీత

65వ రోజూ కొనసాగిన అమరావతి నిరసనలు

గుంటూరు/మంగళగిరి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి గ్రామాల్లో ప్రశాంతంగా సాగుతున్న నిరసనలు గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీశాయి. మహిళా తహశీల్దార్‌ను అడ్డుకున్నారన్న కారణంతో దాదాపు 400 మంది రైతులపై పోలీసులు కేసులు పెట్టడంతో రాజధాని ప్రాంత ప్రజలు రగిలిపోయారు. ఏం తప్పు చేశారని కేసులు పెడతారంటూ నిప్పులు చెరిగారు. ‘‘అధికారులే మహిళలా? మేము మహిళలం కాదా? 65 రోజులుగా రోడ్డుపైనే ఉన్నా పట్టించుకోరా? న్యాయం అడిగితే మాపైనే కేసులు పెడతారా?’’ అంటూ మందడం గ్రామస్థులు, మహిళలు, రైతు కూలీలు మండుటెండలో రోజంతా రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు గురువారం 65వ రోజుకు చేరాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, తాడికొండ అడ్డరోడ్డులో రైతులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు. 


న్యాయం అడిగితే కేసులా?

కృష్ణాయపాలెంలో బుధవారం ఇళ్ల స్థలాల కోసం భూములను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు 400 మంది పైగా రైతులపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ మందడం దీక్షా శిబిరం వద్ద బైఠాయించిన మహిళలు, రైతులు, కూలీలు రహదారిని దిగ్బంధించారు. ధర్నాలు చేస్తున్న వారికి మద్దతుగా తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్దఎత్తున మందడం చేరుకున్నారు. దీంతో సచివాలయం వైపు వెళ్లే రహదారుల్లో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, మాకు హక్కులు వర్తించవా.. అని నిలదీశారు. మేము భూములు ఇచ్చింది రాజధాని అభివృద్ధికి.. ఆ భూములను పేదలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు.


ఎన్నిసార్లు కేసులు పెడతారు? పెట్టుకోండి భయపడేది లేదని తెగేసి చెప్పారు. కాగా పెనుమాకలో జరుగుతున్న రైతుల దీక్షకు ‘ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌’ సంఘీభావం తెలిపింది. నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు గ్రామాల్లో దీక్షలు 65వ రోజుకు చేరాయి. పెదపరిమి, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మందడం దీక్షా శిబిరాలను మాజీ మంత్రి, జేఏసీ నేత ఆలపాటి రాజా సందర్శించారు. జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నాడు కాబట్టి అందరూ ఆయనలాగే జైలుకెళ్లాలనే వింత మనస్తత్వం ఉందన్నారు. మహిళా జేఏసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ, త్యాగం చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు.  


400 మందికిపైగా రైతులపై కేసులు 

తహశీల్దార్‌ను అడ్డగించారనే కారణంగా రాజధాని ప్రాంతానికి చెందిన 400మందికిపైగా రైతులపై ఆరేడు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పేదలకు నివేశన స్థలాల పంపిణీ కోసం కృష్ణాయపాలెం-మందడం గ్రామాల మధ్య ఉన్న సీఆర్డీయే భూములను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ భూముల్లో బుధవారం దుగ్గిరాల మండల తహశీల్దారు మల్లీశ్వరి ఆధ్వర్యంలో సర్వే జరుగుతుండగా రైతులు అడ్డుకోవడంతో పాటు వాహనం ఎదుట బైఠాయించా రు. ఈ ఘటనపై గురువారం తహశీల్దారు మల్లీశ్వరి వద్ద నుంచి మంగళగిరి పోలీసులు ఫిర్యాదును స్వీకరించి 400 మందికిపైగా రైతులపై కేసులు నమోదు చేసినట్టు మంగళగిరి రూరల్‌ సీఐ శేషగిరిరావు తెలిపారు. వీరిలో గురువారానికి 28మందిని గుర్తించామని చెప్పారు. పోలీసులు గుర్తించినవారిలో జడ్పీటీసి మాజీ సభ్యులు బెజవాడ నరేంద్ర, ఆకుల జయసత్య, రైతులు పువ్వాడ సుధాకర్‌, ఏ. వెంకటేశ్వర్లు, ఆవుల కిరణ్‌, ఆకు ల ఉమామహేశ్వరరావు, నూతక్కి శ్రీదేవి ఉన్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రోజా కారుని అడ్డగించిన రైతులు, మహిళలపై కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించా రని మరో కేసు నమోదైంది. 


అనంత రైతుల సంఘీభావం

నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులు, మహిళలకు సంఘీభావం తెలియజేటానికి అనంతపురం నుంచి సీపీఐ నాయకులు, జిల్లా రైతు సంఘం నాయకులు మంద డం విచ్చేశారు. రైతులను, మహిళలను మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, గద్దె అనురాధ పరామర్శించారు. 


గ్రామాల్లో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ 

మందడం, కృష్ణాయపాలెం ఘటనలపై టీడీపీ నియమించిన నిజనిర్ధారణకమిటీ సభ్యులు గురువారం రాత్రి ఆయా గ్రామాల్లో పర్యటించారు. మందడంలో తమ స్నానాల గదిపై డ్రోన్‌ తిప్పారని ఆరోపించిన గ్రామస్ఢుడి ఇంటిని పరశీలించారు. అ నంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ మంత్రి జవహర్‌ రాష్ట్ర ప్రభుత్వం ముందు 4 డిమాండ్లు ఉంచారు. వీటిని 12గంటల్లో పరిష్కరించకపోతే జాతీయ మానవహక్కులు, మహిళా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. 

1) ఆడబిడ్డల ఆత్మాభిమానానికి భంగం కలిగేలా ఇళ్లపై డ్రోన్‌లు తిప్పిన డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలి.

2) కృష్ణాయపాలెంలో 426 మందిపై పెట్టిన కేసులను వేంటనే ఎత్తివేయాలి.

3) జేఏసీ నేతలు పువ్వాడ సుధాకర్‌, గద్దె తిరపతిరావు, కే శ్రీనివాసురావులపై డీఎస్పీ, ఇతర పోలీసులు దాడిచేస్తుంటే అడ్డుగా నిలిచిన మహిళలను లం....ల్లారా అంటూ దుర్భాషలాడిన వారిని దిశ చట్టం కింద అరేస్టులు చేయాలి.

4) రాజధాని ప్రాతంలో పేదల కోసం నిర్మించిన 5,200 ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి.

Advertisement
Advertisement
Advertisement