భూమా అఖిల భర్త, సోదరుడిపై చీటింగ్ కేసు.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2021-07-08T17:42:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌, అతని సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదైంది.

భూమా అఖిల భర్త, సోదరుడిపై చీటింగ్ కేసు.. ఎందుకంటే..

హైదరాబాద్ సిటీ/బోయిన్‌పల్లి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌, అతని సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదైంది. కొవిడ్‌ సోకిందని నకిలీ ధ్రువపత్రాలు సమర్పించడంతో బోయిన్‌పల్లి స్టేషన్‌లో చీటింగ్‌కేసు నమోదైంది. సీఐ రవికుమార్‌ తెలిపిన ప్రకారం.. బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసు విచారణలో భాగంగా భార్గవరామ్‌, జగద్విఖ్యాత్‌రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీనిని తప్పించుకునే క్రమంలో వీరిద్దరూ నకిలీ కొవిడ్‌ ధ్రువీకరణ సర్టిఫికెట్‌లను సమర్పించి పోలీసులకు దొరికిపోయారు. వీరిరువురితో పాటు సహకరించిన మరో ముగ్గురిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.


కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌(టీఐపీ) నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమకు కొవిడ్‌ సోకిందని, టీఐపీకి హాజరుకాలేమని తెలుపుతూ పోలీసులకు వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతోపాటు లాయర్‌ ద్వారా సికింద్రాబాద్‌లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు సమయంకంటే ముందుగానే నివేదించారు. అనుమానం వచ్చిన పోలీసులు  విచారణ చేపట్టారు. ఓ ల్యాబ్‌లోకొవిడ్‌ పాజిటివ్‌ నకిలీ రిపోర్టు తీసుకున్నట్లు గుర్తించారు. భార్గవరామ్‌, జగద్విఖ్యాత్‌రెడ్డిలతోపాటు వీరికి సహకరించిన వినయ్‌కుమార్‌, రత్నాకర్‌, శ్రీదేవిపైన కేసులు నమోదు చేశారు. పోలీసులు శ్రీదేవికి నోటీసులు అందజేశారు. వినయ్‌కుమార్‌, రత్నాకర్‌ను రిమాండ్‌కు తరలించారు. భార్గవరామ్‌, జగద్విఖ్యాత్‌రెడ్డి పరారీలో ఉన్నారు.

Updated Date - 2021-07-08T17:42:38+05:30 IST