జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-07-31T20:40:22+05:30 IST

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఐపీసీ 153A (506) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై హెడ్ కానిస్టేబుల్ చత్రు నాయక్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఆయన కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. భారీ బందోబస్తు మధ్య శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన తాడిపత్రి మున్సిపల్‌ రెండవ వైస్‌ చైర్మన్ ఎన్నికలో టీడీపీ మద్దతు ఇచ్చిన అబ్దుల్‌రహీం విజయం సాధించారు.


ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయం ఏమిటో ఇక నుంచి తాను చూపిస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హెచ్చరిస్తూ మీసం మెలేశారు. టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌.. వైస్‌ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని తన సత్తా ఏమిటో పెద్దారెడ్డికి మరోసారి నిరూపించానని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను గానీ, కొడుకు, భార్య గానీ తమ తడాఖా ఏమిటో జేసీ సోదరులకు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన పెద్దారెడ్డి చివరికి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవాచేశారు.


ఆర్డీఓ మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగిన తాడిపత్రి మున్సిపల్ వైస్‌ చైర్మన్ ఎంపిక కార్యక్రమానికి వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టగా, మున్సిపల్‌ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన రాకపోవడంతో టీడీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు, ఇండిపెండెంట్‌, సీపీఐ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన్ కోసం 4వ వార్డు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ అబ్దుల్‌రహీం బరిలోకి దిగారు. ఆయనకు మద్దతుగా 18మంది కౌన్సిలర్లు చేతులు పైకెత్తారు. వైసీపీ కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు మేరకు అబ్దుల్‌రహీంను వైస్‌ చైర్మనగా అధికారులు ప్రకటించారు.


Updated Date - 2021-07-31T20:40:22+05:30 IST