విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుస్తుంటారు. విజయ్ సేతుపతిని తన్నిన వారికి ప్రతిసారీ రూ.1001 రివార్డ్‌గా చెల్లిస్తానని హిందూ మక్కల్ కట్చి నాయకుడైన అర్జున్ సంపత్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఈ ఉదంతంపై పోలీసులు తాజాగా కేసును నమోదు చేశారు. అర్జున్ సంపత్‌కు వ్యతిరేకంగా నవంబర్ 17న కేసును నమోదు చేశామని కోయంబత్తూర్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 504, సెక్షన్ 506(1) కింద అర్జున్‌పై కేసును నమోదు చేశామన్నారు. ప్రస్తుతం నిందితుడిపై దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేశారు.
‘‘ స్వాత్రంత్య సమరయోధుడైన ముత్తు రామలింగం తేవర్‌ను విజయ్ సేతుపతి అవమానించాడు. అందువల్లే మక్కల్ సెల్వన్‌ను తన్నిన వారికి ప్రతిసారి రూ.1001 చెల్లిస్తానని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాను’’ అని హిందూ మక్కల్ కట్చి నాయకుడైన అర్జున్ సంపత్ తెలిపారు. విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో మహా గాంధీ అనే వ్యక్తి దాడి చేసిన అనంతరం ఆ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరోపై దాడి జరగడంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మక్కల్ సెల్వన్‌కు చుట్టూ భద్రతా సిబ్బందికి ఉన్నప్పటికీ అతడిపై దాడి జరగడం గమనార్హం.
అనంతరం బెంగళూరు ఎయిర్ పోర్టు ఘటనపై విజయ్ సేతుపతి తన స్పందనను తెలిపాడు. ‘‘ విమానంలో నాకు, అగంతకుడికి మధ్య చిన్న చర్చ జరిగింది. నాపై దాడి జరిగిన సమయంలో ఆ వ్యక్తి తాగి ఉన్నాడు. ఇటువంటి చిన్న, చిన్న విషయాలను గురించి పట్టించుకోనవసరం లేదు ’’ అని అతడు వెల్లడించాడు.