చిన్న నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలు బలి

ABN , First Publish Date - 2020-04-10T06:14:53+05:30 IST

డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయి బోల్తాపడడంతో ఇద్దరు చనిపోగా..

చిన్న నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలు బలి

మోటార్‌సైక్లిస్ట్‌ హారన్‌ కొట్టడంతో  వెనక్కి చూసిన ట్రాక్టర్‌ డ్రైవర్‌

కాలువలోకి బోల్తా.. ఇద్దరి మృతి 

ఒకరికి తీవ్రగాయాలు

డ్రైవర్‌పై కేసు నమోదు


తిమ్మారెడ్డిపాలెం(లింగసముద్రం) ఏప్రిల్‌ 9 : డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయి బోల్తాపడడంతో ఇద్దరు చనిపోగా.. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన తిమ్మారెడ్డిపాలెం సమీపంలోని చెరువు అలుగు వద్ద గురువారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... వలేటివారిపాలెం మండలంలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ట్రాక్టర్‌లో సిమెంట్‌ బస్తాలు తీసుకొచ్చేందుకు వీఆర్‌కోటకు బయలుదేరారు.  మార్గమధ్యంలో అసలు డ్రైవ ర్‌ బండ్ల వెంకటేశ్వర్లును అడి గి నక్కా కోటేశ్వరరావు ట్రాక్ట ర్‌ డ్రైవింగ్‌ తీసుకున్నాడు. తిమ్మారెడ్డిపాలెం సమీపంలోని అలుగు దాటి చెరువు కట్ట ఎక్కిన తరువాత ఒక మోటారు సైక్లిస్టు దారి ఇవ్వాలని హారన్‌ కొట్టాడు.


దీంతో ట్రాక్టర్‌ నడుపుతున్న కోటేశ్వరరావు వెనక్కి తిరిగి చూడడంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. అందులో ఉన్న కొల్వపల్లి అంకయ్య(55), ఆత్మకూరు కృష్ణయ్య(42)లు అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవింగ్‌లో ఉన్న కోటేశ్వరరావు ట్రాక్టర్‌ నుంచి పక్కకు దూకడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వీరిని రక్షించే ప్రయత్నం చేశారు.


సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సైదుబాబు క్షతగాత్రులను బయటకు తీ యించారు. వీరిలో తీవ్ర గాయాలపాలైన అంకయ్య కుమారుడు అర్జున్‌రావును, స్వల్ప గాయలపాలైన ఉండేల మాధవరెడ్డి, బండ్ల వెంకటేశ్వర్లును చికిత్స కోసం కందుకూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈలోపు వర్షం కురవడంతో సహాయక చర్యలకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. అనంతరం కాలువలో ఉన్న మృతదేహాలను బయటకు తీయించారు. అర్జున్‌నాయక్‌ని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. విష యం తెలిసిన వెంటనే తహసీల్దార్‌ రాఘవస్వామి, హనుమాయమ్మలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలిసిన సీఐ శివరామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ కోటేశ్వరరావుపై కేసు నమోదు చేశామని చెప్పారు. అనంతరం మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


Updated Date - 2020-04-10T06:14:53+05:30 IST