గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఇంత నిర్లక్ష్యమా! ఏం జరుగుతోందో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-02-19T08:18:24+05:30 IST

వివాహితపై సామూహిక అత్యాచారం తాలూకు కేసును నీరుగార్చేందుకు మంగళగిరి రూరల్‌ పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించినట్టు

గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఇంత నిర్లక్ష్యమా! ఏం జరుగుతోందో తెలిస్తే..

  • ఉన్నతాధికారులకు తెలియనివ్వకుండా గోప్యత 
  • స్టేషన్‌లో కనిపించని ఎఫ్‌ఐఆర్‌ 
  • బాధితురాలు ఆలస్యంగా వైద్యపరీక్షలకు
  • స్థానిక పోలీసులతీరుపై అర్బన్‌ ఎస్పీ ఆగ్రహం 
  • దర్యాప్తుకోసం ప్రత్యేకాధికారి నియామకం


మంగళగిరి(గుంటూరు): వివాహితపై సామూహిక అత్యాచారం తాలూకు కేసును నీరుగార్చేందుకు మంగళగిరి రూరల్‌ పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన వెలుగులోకి రాకుండా చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారాన్ని నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి వున్నా స్థానిక పోలీసులు రహస్యంగా దాచేశారు. శనివారం రాత్రి జరిగిన ఘటనపై అదేరోజు  గంటన్నర, రెండుగంటల వ్యవధిలో బాధితురాలు మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు చేయడం.. ఆనక పోలీసులు నిందితులను తెల్లారేలోగా అదుపులోకి తీసుకోవడం కూడ జరిగింది. అయినా... ఈ కేసును రోజువారీ డీఎస్సార్‌లో పేర్కొనలేదు. స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ సిబ్బందికి తెలియనివ్వలేదు...సరికదా అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు కూడ సమాచారం ఇవ్వకుండామరుగుపరిచే ప్రయత్నం చేశారు. సామూహిక అత్యాచారం కేసు విషయంలో స్థానిక పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై అర్బన్‌ ఎస్పీ సీరియస్‌ అయ్యారు. స్థానిక పోలీసు అధికారుల తీరు అనుమానాస్పదంగా వుండడంతో ఈ కేసు దర్యాప్తు నిమిత్తం గుంటూరు మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ బి సీతారామయ్యను ప్రత్యేకాధికారిగా ఎస్పీ నియమించారు. 


అసలేం జరిగిందంటే..

తాడేపల్లికి చెందిన ఓ వివాహిత కొన్నాళ్లుగా ఆర్ధిక ఇబ్బందుల్లో వుంది. ఆమె గతంలో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కింద కొందరికి డిగ్రీ సర్టిఫికెట్లను ఇప్పించారని అంటున్నారు. ఈ వ్యవహారాల్లో పరిచయమైన చినకాకానికి చెందిన ఓ యువకుడు ఆమెకు హయ్‌ల్యాండ్‌లో ఉద్యోగ మిప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఈ విషయమై మాట్లాడేందుకు శనివారం సాయంత్రం హయ్‌ల్యాండ్‌ వద్దకు రమ్మని కబురంపాడు. అతని మాటలు నమ్మి వెళ్లిన ఆమెను కబుర్లలో దింపి చీకటిపడ్డాక ఇక్కడికే వెళ్లివద్దామంటూ తన బైక్‌ ఎక్కించుకుని హాయ్‌ల్యాండ్‌ వెనుకవైపు నిర్జనప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకదశలో ఆమెను నగ్నంగా చెట్టుకు కట్టేశారు కూడా! బాధితురాలు ఎలాగో తప్పించుకుని దుస్తులు లేకుండానే పరుగులు పెడుతూ పక్కనే వున్న యార్లగడ్డ సుబ్బారావు కాలనీకి చేరుకుంది. కాలనీవాసులు ఇచ్చిన దుస్తులు కట్టుకుని వెంటనే మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై ఫిర్యాదుచేసింది. 


ఉన్నతాధికారులకు తెలియనివ్వకుండా...

సామూహిక అత్యాచారం జరిగినట్టు ధ్రువీకరించుకున్న రూరల్‌ స్టేషన్‌ అధికారులు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న ఆధారాలను బట్టి ఆదివారం తెల్లవారుజాము సమయానికి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చినకాకానికి చెందిన ఇద్దరు, నంబూరుకు చెందిన ఒకరు వున్నట్టు తెలిసింది. అత్యాచారం కేసుల్లో బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపించాల్సివున్నా పోలీసులు వెంటనే ఆ పని చేయలేదు. అత్యాచారం ఘటనపై సోమవారం సాయంత్రం సోషల్‌మీడియాలో పోస్టులు రావడంతో అప్పుడు పోలీసు అధికారులు  ఆమెను వైద్యపరీక్షలకు తరలించారు. శనివారం రాత్రి జరిగిన అత్యాచారం...ఫిర్యాదు ఘటనలపై సోమవారానికి కూడ స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వకపోవడం గమనార్హం! ఘటన గురించి డీఎస్సార్‌లో కూడ పేర్కొనకపోవడంపై అర్బన్‌ ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సమాచారం వెలుగు చూసిందిలా!

సామూహిక అత్యాచారం జరిగిన సంగతి హయ్‌ల్యాండ్‌ పక్కనవున్న యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసుల నుంచి బయటకు పొక్కింది. కాలనీవాసులు ఈ ఘటనపై చర్చించుకుంటున్న సంగతి ఆనోటాఈనోటా పచార్లు చేస్తూ వరకు సోమవారం సాయంత్రానికి సోషల్‌మీడియాస్థానిక గ్రూపుల్లో పోస్టులకు ఎక్కింది. అయితే దీనిని ధ్రువీకరించుకునేందుకు విలేకరులు రూరల్‌ పోలీసులను సంప్రదించినప్పటికీ వారు వాస్తవ సమాచారాన్ని చెప్పేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. 


రాష్ట్రంలో దిశ తొలి అత్యాచారం కేసు

రాష్ట్రంలో దిశ చట్టం అమల్లోకి వచ్చాక మొట్టమొదటి అత్యాచారం కేసు చినకాకాని ఘటనతో మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైంది. ఈ కేసును స్థానిక పోలీసు అధికారులు నీరుగార్చడానికి ప్రయత్నించారనే అనుమానాల నేపథ్యంలో అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ  మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ బి.సీతారామయ్యకు ఈ కేసును అప్పగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం డీఎస్పీ మంగళగిరి రూరల్‌స్టేషన్‌కు వచ్చి కేసును పర్యవేక్షించారు. ఇదే సందర్భంలో అర్బన్‌ ఎస్పీ ఈ కేసు విషయమై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్థానిక రూరల్‌ సీఐ శేషగిరిరావుతో పాటు నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌, అదనపు ఎస్పీ ఈశ్వరరావులను తనవద్దకు పిలిపించుకుని సంజాయిషీ అడిగినట్లు తెలిసింది. ఈ సమయంలో కేసు పర్యవేక్షణకై మంగళగిరి వచ్చిన ప్రత్యేకాధికారి సీతారామయ్య సదరు ఎఫ్‌ఐఆర్‌, ఫిర్యాదుపత్రం గురించి స్టేషన్‌లో వాకబు చేయగా వాటిని సీఐ తన వద్ద వుంచుకున్నారని స్టేషన్‌ సిబ్బంది బదులివ్వడం గమనార్హం!

Updated Date - 2020-02-19T08:18:24+05:30 IST