కలెక్టరేట్‌లోనే మహిళపై కలెక్టర్ అత్యాచారం

ABN , First Publish Date - 2020-06-04T13:07:14+05:30 IST

ఓ మహిళ భర్తను డిస్మిస్ చేస్తానంటూ బెదిరించి, ఆమెపై కలెక్టరేట్ కార్యాలయంలోనే అత్యాచారం జరిపిన కలెక్టరు బాగోతం....

కలెక్టరేట్‌లోనే మహిళపై కలెక్టర్ అత్యాచారం

కేసు నమోదు

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): ఓ మహిళ భర్తను డిస్మిస్ చేస్తానంటూ బెదిరించి, ఆమెపై కలెక్టరేట్ కార్యాలయంలోనే అత్యాచారం జరిపిన కలెక్టరు బాగోతం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని జంగజీర్ చాంఫ్ జిల్లాలో వెలుగుచూసింది. జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ మే 15వతేదీన కలెక్టరు కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశారని 33 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి తనపై కలెక్టరు అత్యాచారం చేశాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము కలెక్టరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జంగజీర్ చాంపా జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్ చెప్పారు.


మహిళపై అత్యాచారం చేసిన కలెక్టరును చత్తీస్‌ఘడ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా సర్కారు బదిలీ చేసింది. తనకు కలెక్టరు అశ్లీల సందేశాలు పంపించి, అత్యాచారం చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీచక కలెక్టరు పాథక్ పై పోలీసులు ఐపీసీ 376, 506, 509 బి కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన ఐఎఎస్ అధికారిని ఇంకా అరెస్టు చేయలేదు.

Updated Date - 2020-06-04T13:07:14+05:30 IST