నేర కథా చిత్రమ్‌!

ABN , First Publish Date - 2022-06-06T08:01:47+05:30 IST

అమాయక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఒకవేళ విషయం బయటపడినా అంత తేలిగ్గా దొరక్కుండా ఉండేందుకు కుయుక్తులు పన్నారు. తమ సిమ్‌ కార్డులను ఇద్దరు ఇతర వ్యక్తుల ఫోన్లలో వేసి వాళ్లను

నేర కథా చిత్రమ్‌!

బాలికపై సామూహిక అత్యాచారం కేసు..

క్రిమినల్‌ బ్రెయిన్‌తో నిందితుల ఎత్తుగడలు

ఆధారాలు దొరక్కుండా చేసేందుకు యత్నం

గోవా వెళ్లినట్లు నమ్మించి.. కర్ణాటకకు పరార్‌

నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం!

ఎఫ్‌ఐఆర్‌లో చేరనున్న మరికొందరి పేర్లు..

పోలీసుల అదుపులో ఇంకో నిందితుడు 

నేడు విచారణకు రావాలంటూ

మజ్లిస్‌ కార్పొరేటర్‌కు నోటీసులు

సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయడం కోసం 

నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు


ఏ ఫామ్‌హౌస్‌ వద్ద స్వాధీనం చేసుకున్నారు?

ఇన్నోవా కారును మొయినాబాద్‌లోని ఏ ఫామ్‌హౌస్‌ వద్ద స్వాధీనం చేసుకున్నారో పోలీసులు బయటపెట్టడం లేదు. గండిపేట సమీపంలోని ఓ ఫాంహౌ్‌సలో కారును స్వాధీనం చేసుకున్నట్లు కొందరు చెబుతుండగా, ఎన్కేపల్లి సమీపంలోని వెంచర్‌లో ఉన్న నిందితుల బంధువుల ఇంటి వద్ద నుంచి స్వాధీనం చేసుకునట్లు మరికొందరు చెబుతున్నారు. స్థానిక పోలీసులను ఈ విషయమై అడిగితే తమకు తెలియదని సమాధానమిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ, బంజారాహిల్స్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): అమాయక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఒకవేళ విషయం బయటపడినా అంత తేలిగ్గా దొరక్కుండా ఉండేందుకు కుయుక్తులు పన్నారు. తమ సిమ్‌ కార్డులను ఇద్దరు ఇతర వ్యక్తుల ఫోన్లలో వేసి వాళ్లను గోవా పంపారు.. వారు మాత్రం తెలివిగా వేరే సిమ్‌లతో కర్ణాటక వెళ్లారు. అత్యాచారానికి వాడిన ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసేందుకు యత్నించారు. ప్రభుత్వ వాహనం అని ఉన్న స్టిక్కర్‌ను తొలగించేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరును కూడా గుర్తుపట్టకుండా చేశారు. ఒక్కచోట ఉండకుండా వేర్వేరుచోట్లకు పరారయ్యారు. ఆఖరికి సోషల్‌ మీడియా ఖాతాలను డిలీట్‌ కొట్టి.. బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఇలా.. క్రిమినల్‌ బ్రెయిన్‌తో చేయాల్సినదంతా చేశారు. అయితే, బాలిక ధైర్యం కూడదీసుకుని నిజం చెప్పడంతో వారి దురాగతం దాగలేదు..! అదే సమయంలో దొరక్కుండా తప్పించుకుందామనే వారి ప్రయత్నాలూ పారలేదు. ఇప్పుడు ఒక్కొక్కరుగా కటకటాల వెనక్కు వెళ్తున్నారు. బాలిక వాగ్మూలం ప్రకారం సామూహిక అత్యాచారంలో ఐదుగురు పాల్గొన్నారు. ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు. వీరిలో సాదుద్దిక్‌ మాలిక్‌ను శుక్రవారమే అరెస్టు చేశారు. అదే రోజు ఇద్దరు మైనర్లను జువెనైల్‌ కోర్టులో హాజరుపర్చారు. మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం మరో నిందితుడు ఉమేర్‌ అలీఖాన్‌ (18) కర్ణాటకలోని గుల్బర్గలో దొరికినట్టు సమాచారం. ఉమేర్‌.. కోయంబత్తూర్‌, ఊటీ, గుల్బర్గల్లో తలదాచుకున్నాడు. పోలీసుల ప్రత్యేక బృందం అతడిని అదుపులోకి తీసుకుని మే 28న ఏం జరిగింది? అత్యాచారం చేసింది ఎవరు? ఎందరు? అనే కోణంలో ప్రశ్నిస్తోంది.


నేడు మాజీ మేయర్‌  విచారణ

కేసు దర్యాప్తులో భాగంగా ఓ ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు విచారించనున్నారు. మాజీ మేయర్‌ కూడా అయిన ఆయన.. నిందితులకు సహకరించారన్న ఆరోపణలు రావడంతో సోమవారం విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు పంపారు. నిందితులకు సహకరించేందుకు ఆయన కారులో మొయినాబాద్‌ వరకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కాగా, కేసులో ఇప్పటిదాకా ఐదుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.


ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమంలో వచ్చిన కొన్ని వీడియోలు, ఫొటోల ఆధారంగా పబ్‌ నుంచి బేకరీకి బాలిక సహా బెంజ్‌ కారులో ప్రయాణించిన వారి పాత్రపైనా ఆరా తీస్తున్నారు. బెంజ్‌లో ఆ సమయంలో పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడితో పాటు ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ఇద్దరు మైనర్ల పేర్లు ఉన్నాయి. మరో ఇద్దరి విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం ఆదివారం ఓ బృందం సీసీ ఫుటేజీని పరిశీలించింది. వ్యాపార సముదాయాల్లో ఉన్న సీసీ ఫుటేజీని కూడా సేకరించింది. సీజ్‌ చేసిన బెంజ్‌తో పాటు ఇన్నోవాలో క్లూస్‌ టీంతో పాటు ఫోరెన్సిక్‌ బృందం ఆదివారం క్షుణ్నంగా తనిఖీ చేసింది. బెంజ్‌లో బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పును క్లూస్‌ టీమ్‌ సీజ్‌ చేసింది. రెండు వాహనాల్లో బాలిక వెంట్రుకలను స్వాధీనం చేసుకుంది. కాగా, ఘటనలో మూడో కారు కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు కార్ల గురించి మాత్రమే నిర్ధారించిన పోలీసులు మూడో కారు గురించి.. అందులో ఉన్న వ్యక్తుల గురించి ప్రస్తావించలేదు. ఘటనకు సంబంధించినదా కాదా అని స్పష్టత లేనప్పటికీ.. మరో బెంజ్‌ కూడా  ఉందని సమాచారం. 


ఇన్నోవా.. ఇప్పటికే మిస్టరీనే

అత్యాచారం తర్వాత నిందితులు నేరుగా ఇన్నోవాలో మొయినాబాద్‌ వెళ్లారు. ఓ రాజకీయ నేత ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం పొంది వేర్వేరు చోట్లకు పరారయ్యారు. ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలో.. ఫామ్‌హౌస్‌ వెనుక ఇన్నోవాను దాచేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫాంహౌస్‌, నిందితుల్లో ఒకరి కుటుంబానికి చెందిందని తెలుస్తోంది. కారుపై ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపించకుండా, టీఆర్‌ నంబర్‌ గుర్తుపట్టకుండా చేశారు. తమ సిమ్‌కార్డులను ఇద్దరి వ్యక్తుల ఫోన్లలో వేసి వాళ్లను గోవా పంపించి.. నిందితులు కర్ణాటకకు వెళ్లారు. ఫామ్‌హౌస్‌ యజమానిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఇన్నోవా విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై మొదటి నుంచి విమర్శలున్నాయి.


దీనిని 2019లో కొన్నప్పటికీ ఇంకా టీఆర్‌ నంబరు మీదనే నడుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో ఇన్నోవాపై ప్రభుత్వ కారు స్టిక్కర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏ స్టిక్కర్‌ లేదు. ఇంజిన్‌ నంబర్‌ ఆధారంగా పరిశీలిస్తే కారు ఓ మహిళ పేరిట ఉంది. ఫుటేజీలో వాహనం వివరాలు కనిపించినప్పటికీ కేసు నమోదయ్యాక నాలుగు రోజులకు మొయినాబాద్‌లో ఓ ఫాంహౌస్‌ వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే స్టీరింగ్‌ సహా సీట్లపై ఉన్న వేలి ముద్రలు సేకరించలేదు. హైదరాబాద్‌ తీసుకొచ్చాక ఆధారాల కోసం వెదికారు. కాగా, నిందితుల అరెస్టులు కూడా పూర్తవడంతో పోలీసులు సాంకేతిక, ఇతర ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం రిమాండ్‌లో ఉన్న నిందితులను కస్టడీకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమ లేదా మంగళవారాల్లో కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, షాక్‌కు గురైన బాలిక పూర్తిగా కోలుకోవడంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేయనున్నారు. 


వీడియోలు బయటపెట్టింది నిందితుల సంబంధీకులే?

ఘటన వెలుగుచూసిన రోజు పోలీసులు ఐదుగురు నిందితులు, వారిలో ప్రభుత్వ సంస్థ చైర్మన్‌ కుమారుడు కూడా ఉన్నాడని వెల్లడించారు. అయితే, ఓ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించిన మిగతా నిందితుల తల్లిదండ్రులు వీడియోలను పోలీసులకు లేదా రాజకీయ నేతలకు చేరవేసినట్లు సమాచారం. అవి బయటకు రాగానే పోలీసులు.. ఎమ్మెల్యే కుమారుడి పేరు ఏ-6గా చేర్చనున్నారన్న వార్త బయటకు వచ్చింది. ఇంకా ఎవరినైనా విస్మరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో మరిన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

Updated Date - 2022-06-06T08:01:47+05:30 IST