Oct 19 2021 @ 22:02PM

‘మా’: మోహన్‌బాబుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

‘మా’ ఎన్నికల వ్యవహారం ముగిసినా.. మరో వైపు రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికలలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు గెలుపొంది అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌తో ఎన్నికల రోజు జరిగిన రౌడీయిజాన్ని బయటపెడతానంటూ.. ఇప్పటికే ఫుటేజ్ కోసం ఎన్నికల అధికారికి లేఖ రాశారు. దీనిపై ప్రస్తుతం హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. ఇక ‘మా’ ఎన్నికల అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికలు ప్రపంచం అంతా మాట్లాడుకునేలా జరిగాయి. ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఆఖరికి గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా ఫోన్ ఉంది. వాళ్లు కూడా ఇక్కడ ఏం జరుగుతుందా? అని గమనిస్తున్నారు..’’ అనేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల పెంపకం దారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మా వృత్తిని కించపరిచేలా మాట్లాడిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పీఎస్‌లలో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.