రూ. 2 కోట్ల సొత్తు చోరీ కేసులో పురోగతి

ABN , First Publish Date - 2020-08-09T08:41:54+05:30 IST

సైనిక్‌పురిలో ఈ నెల 3న జరిగిన భారీ చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించినట్లు..

రూ. 2 కోట్ల సొత్తు చోరీ కేసులో పురోగతి

  • నేపాల్‌ ముఠా ఆటకట్టించిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సైనిక్‌పురిలో ఈ నెల 3న జరిగిన భారీ చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. నేపాల్‌కు చెందిన ముఠా ఆటకట్టించినట్లు సమాచారం. చోరీ జరిగిన ఇంట్లో పనిచేస్తున్న వాచ్‌మన్‌ సహా అతడి అనుచరులతో కలిపి మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చోరీ జరిగిన అనంతరం వారు నేపాల్‌కు పారిపోతున్న క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సైనికపురిలోని ఎవెన్యూ రోడ్డులో ఉంటు న్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నర్సింహారెడ్డి తన కుమారుడి రిసెప్షన్‌ను ఫలక్‌నుమా ప్యాలె్‌సలో ముగించుకొని ఇంటికి వచ్చేసరికి చోరీ జరిగింది.


ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతోపాటు బంగారం, వజ్రాభరణాలు, నగదు సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురైంది. అంతేకాకుండా ఇంట్లోనే ఓ అవుట్‌హౌజ్‌లో ఉంటూ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న బీమ్‌ తన భార్యతోసహా ఉడాయించాడు. తనే చోరీకి పాల్పడి పారిపోయాడని పోలీసులు అనుమానించారు. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు డీసీపీ రక్షితామూర్తి ఆధ్వర్యంలో ఎస్‌వోటీ సహా మొత్తం 7 ప్రత్యేక పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌ వాచ్‌మన్‌తోపాటు మరో ముగ్గురు దొంగలు కలిసి ఈ చోరీకి స్కెచ్‌ వేసినట్లు   గుర్తించారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-08-09T08:41:54+05:30 IST