డాన్స్ మాస్టర్ లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడు: వరంగల్ యువతి

ABN , First Publish Date - 2020-03-10T19:46:13+05:30 IST

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్.

డాన్స్ మాస్టర్ లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడు: వరంగల్ యువతి

హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ బషీర్బాగ్‌లోని ఎస్సీ ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన దివ్య మాట్లాడుతూ.. లారెన్స్ సోదరుడు వినోద్‌ చాలామందిని వ్యభిచార రొంపిలోకి దింపాడని, వారిలో తన స్నేహితులు కూడా ఉన్నారని చెప్పింది. తనకు కూడా ఇలాంటి ప్రపోజల్ ఇస్తే తాను నిరాకరించానని, అప్పటి నుంచి వినోద్ తనను వేధించడం మొదలు పెట్టాడని తెలిపింది. చాలాకాలం ఈ వేధింపులు భరించానని, అతని ప్రవర్తన మితిమీరడంతో తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. కానీ అక్కడి సీఐ తనపై తప్పుడు కేసులు పెట్టాడని, లారెన్స్‌తో చేతులు కలిపి తనను వ్యభిచారిగా చిత్రించే ప్రయత్నం చేశారి ఆరోపించింది. ఆ పోలీస్ అధికారి లారెన్స్‌ ఎలా చెబితే అలానే చేస్తూ తనను అసభ్యపదజాలంతో దూషించాడని చెప్పింది. ఈ విషయంలో లారెన్స్‌కు సదరు సీఐ నమ్మిన బంటులా మారిపోయారని తెలిపింది. ఆ పోలీసు అధికారి అండతో తనను జైలుకు కూడా పంపించారని దివ్య ఆరోపించింది. ఇదిలా ఉండగా, కొన్ని రోజులుగా తనను కొందరు ఫాలో అవుతున్నారని, వారేం చేస్తారోనని భయంగా ఉందని చెప్పింది. వినోద్‌కు వ్యతిరేకంగా తన వద్ద ఉన్న చాలా సాక్ష్యాలను వినోద్ దొంగిలించాడని, తన వద్ద ఇంకా సాక్ష్యాలు ఉన్నాయనే అనుమానంతో తన వెంట అనుచరులను పంపుతున్నాడని దివ్య ఆరోపించింది.


లారెన్స్ తమ్ముడితో తనకు ప్రాణ భయం ఉందని చెప్పింది. ఈ సందర్భంగా లారెన్స్ సోదరుడి నుంచి తనను కాపాడాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకుంటున్నానని పేర్కొంది. లారెన్స్ ప్రస్తుతం తన హిట్ చిత్రం ‘కాంచన’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - 2020-03-10T19:46:13+05:30 IST