సోము వీర్రాజుపై కేసు

ABN , First Publish Date - 2022-06-09T01:39:08+05:30 IST

ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోమువీర్రాజుపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

సోము వీర్రాజుపై కేసు

రాజమండ్రి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. జొన్నాడ వెళ్తుండగా సోమువీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్‌ఐ శివప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. దీంతో సోమువీర్రాజుపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో అమాయకులను అరెస్టు చేశారని... వారి కుటుంబాలను పరామర్శించడానికి సోము వీర్రాజు, జొన్నాడ వెళ్లారు. అయితే కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సెంటరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ ఆయన కారులోంచి దిగి తననే అడ్డుకుంటారా అంటూ ఒంటికాలిపై లేచారు.


అక్కడే ఉన్న ఆలమూరు ఎస్‌ఐ శివప్రసాద్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమలాపురం వెళ్లడానికి అనుమతి లేదని వీర్రాజుకు తేల్చిచెప్పారు. దీంతో సోముతో పాటు అక్కడికి చేరుకున్న పలువురు బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లడం కుదరదని చెప్పడంతో సోము మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఈ సమయంలో ఆలమూరు ఎస్‌ఐ శివప్రసాద్‌తో పాటు అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిపై సోము వీర్రాజు మండిపడ్డారు.

Updated Date - 2022-06-09T01:39:08+05:30 IST