అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-02-04T21:33:13+05:30 IST

ఈ నెల 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికార భారతీయ జనతా పార్టీకి ఈ కూటమి గట్టి పోటీనిస్తుందనే ప్రచారం కూడా..

అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరిపై కేసు నమోదు

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ చౌదరి సహా మరో 400 మందిపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరు కొవిడ్-19 నియమాలను అతిక్రమించారని నోయిడాలోని దాద్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పెద్ద ఎత్తున జన సమూహం వచ్చారని, ఎన్నికల సంఘం సూచించిన కొవిడ్-19 నిబంధనలను ఇరు నేతలు అతిక్రమించారని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు.


ఈ నెల 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికార భారతీయ జనతా పార్టీకి ఈ కూటమి గట్టి పోటీనిస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై కొవిడ్-19 నిబంధనల కింద కేసు నమోదు కావడం గమనార్హం. కొవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా జనవరి 31 వరకు బహిరంగ ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం కొన్ని పరిమితులతో అనుమతి ఇచ్చినప్పటికీ, వెయ్యి మందికి లోబడి సభలు నిర్వహించుకోవాలని ఈసీ సూచించింది.

Updated Date - 2022-02-04T21:33:13+05:30 IST