నేటి నుంచి బండి పాదయాత్ర

ABN , First Publish Date - 2022-05-10T04:38:34+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోవిడత చేపట్టిన

నేటి నుంచి బండి పాదయాత్ర

  • రంగారెడ్డి జిల్లాలో ఐదు రోజులపాటు యాత్ర
  • 14న తుక్కుగూడలో ముగింపు
  • ముగింపు సభకు అమిత్‌షా హాజరు
  • 5లక్షల మంది జనసమీకరణకు సన్నాహాలు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి / షాద్‌నగర్‌, మే 9 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోవిడత చేపట్టిన  ప్రజాసంగ్రామ పాదయాత్ర నేడు రంగారెడ్డిజిల్లాలో ప్రవేశించనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని నేటి ఉదయం 9గంటలకు ఆయన రంగారెడ్డిజిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో  ప్రవేశించనున్నారు. కేశంపేట, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో అయిదు రోజుల పాటు బీజేపీ యాత్ర సాగనుంది. ఈనెల 14వ తేదీన నగర శివార్లలోని మహేశ్వరం మండలం తుక్కుగూడలో ముగియనుంది. తుక్కుగూడలో జరిగే ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మే 14వ తేదీ సాయంత్రం జరిగే అమిత్‌షా బహిరంగ సభకు భారీగా జనాన్ని తరలించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. తుక్కుగూడలో ఔటర్‌ రింగురోడ్డుకు సమీపంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ విజయవంతమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరైన సభకు కాంగ్రెస్‌ నేతలు భారీగా జనసమీకరణ చేశారు. అయితే రాహుల్‌ సభకు దీటుగా తుక్కుగూడలో సభ నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 5లక్షల మందిని సమీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. భారీ బహిరంగ సభ కోసం తుక్కుగూడ ఔటర్‌ రింగురోడ్డు పక్కన 22 ఎకరాల స్థలాన్ని సభకు ఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం మరో 30 ఎకరాలు ఎంపిక చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్‌ చేసిన నియోజకవర్గాల్లో మహేశ్వరం ఒకటి. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే కారణంగా భారీ బహిరంగ సభకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇదిలాఉంటే అమిత్‌షా సభకు రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. జనసమీకరణకు  నియోజకవర్గాల వారీగా నేతలకు టార్గెట్‌లు పెట్టారు. ఇప్పటికే జనసమీకరణపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


బండి సంజయ్‌ పాదయాత్ర ఇలా...

నేడు షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామం నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. కేశంపేట మండల పరిధిలో  రెండు రోజుల పాటు బండి సంజయ్‌ పాదయాత్ర నిర్వహిస్తారు. కేశంపేటలో మంగళవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తొమ్మిదిరేకుల, కాకునూరు, సుందరాపూర్‌ గ్రామాల మీదుగా కేశంపేట మండల కేంద్రం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదేరోజు రాత్రి కొత్తపేట గ్రామంలో బస చేస్తారు. తిరిగి 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి యాత్ర ప్రారంభమై కొత్తపేట, సంతాపూర్‌, కొనాయాపల్లి గ్రామాల మీదుగా సాగనుంది. 12వ తేదీ మురళీనగర్‌, చిప్పాయిపల్లి, ధన్నారం, పులిమామిడి మీదుగా కొనసాగి దావుద్‌గూడ తండా దాటిన తరువాత బస చేస్తారు. 13వ తేదీ ఎన్డీతండా, పెద్దమ్మ తండా, మహేశ్వరం మీదుగా ఇమామ్‌గూడ చేరుకుని అక్కడ బస చేస్తారు. చివరి రోజైన 14వ తేదీ  కేవలం 1.5 కి.మీ దూరమే యాత్ర సాగనుంది. సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో జనసమీకరణ ఏర్పాట్లపైనే పార్టీ యంత్రాంగం మొత్తం దృష్టిసారించనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు పాదయాత్ర గంటలోపే ముగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. 


11వ తేదీ ఉత్కంఠ

కేశంపేటలో 11వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు కేశంపేట మండలానికి వస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. అనూహ్యంగా కేశంపేటలో మంత్రి హరీ్‌షరావు పర్యటన సోమవారం సాయంత్రం ఖరారు చేశారు. 11వ తేదీన హరీ్‌షరావు కొత్తూరు మండలం దర్గాను సందర్శించి అనంతరం కేశంపేట మండలానికి వెళ్తారు. మండలంలో ఎక్లా్‌సఖాన్‌పేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కేశంపేట మండల కేంద్రంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిని పెంచుతూ 30 పడకల ఆసుపత్రిగా నిర్మిస్తున్న క్రమంలో ఆ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.45 నిమిషాలకు షాద్‌నగర్‌ పట్టణానికి చేరుకుని ఇక్కడ వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆకస్మాత్తుగా మంత్రి పర్యటన ఖరారు కావడంతో అటు నాయకులు.. ఇటు పోలీసులలో హడావిడి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి మండలంలో పటిష్ఠ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ కుశాల్కర్‌ తెలిపారు.


అహంకారపూరిత రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతాం 

తెలంగాణలో అహంకారపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర చేపట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పేర్కొన్నారు. నేటి నుంచి కేశంపేట మండలంలో రెండురోజులపాటు జరగనున్న బండి సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా సోమవారం షాద్‌నగర్‌ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను నిలదీయడానికే బండి సంజయ్‌ ఇక్కడ పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. ప్రధానంగా చౌదరిగూడ మండలంలోని లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంపై బండి సంజయ్‌ నిలదీయనున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే లక్ష్మీదేవునిపల్లిలో కుర్చీవేసుకుని  కూర్చొని రిజర్వాయర్‌ నిర్మిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి మరిచిపోయారని గుర్తు చేశారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి దేపల్లి అశోక్‌గౌడ్‌ మాట్లాడుతూ  బండి సంజయ్‌ పాదయాత్రతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిందని, వరి ధ్యానం కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.  సమావేశంలో షాద్‌నగర్‌ నియోజకవర్గ నేత శ్రీవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నేత పి.విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ టి.విజయకుమార్‌, సీనియర్‌ నేత అందె బాబయ్య, పార్టఈ జిల్లా ఉపాధ్యక్షులు భూపాలచారి, పాదయాత్ర ప్రముఖ్‌ పాపయ్య గౌడ్‌, అరుణ్‌కుమార్‌, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. 



Read more