ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ బ్లాక్‌బస్టర్‌!

ABN , First Publish Date - 2020-03-06T06:22:33+05:30 IST

కరోనా దెబ్బకు మార్కెట్‌ సెంటిమెంట్‌ ప్రతికూలంగా మారిన తరుణంలో తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు వచ్చిన ఎస్‌బీఐ కార్డ్స్‌కు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం..

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ బ్లాక్‌బస్టర్‌!

  •  22 రెట్లకు పైగా ఇష్యూ  సబ్‌స్ర్కిప్షన్‌

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు మార్కెట్‌ సెంటిమెంట్‌ ప్రతికూలంగా మారిన తరుణంలో తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు వచ్చిన ఎస్‌బీఐ కార్డ్స్‌కు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. బలమైన ఆర్థిక మూలాలు కలిగిన ఈ కంపెనీ ఈక్విటీ వాటాలను దక్కించుకునేందుకు భారీగా పోటీపడ్డారు. దాంతో ఇష్యూ సైజుకు 22.45 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓ ప్రక్రియలో భాగంగా కంపెనీ.. గత నెల 29న 74 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,769 కోట్లు సేకరించిగలిగింది. ఈ నెల 2న ప్రారంభమైన ఈ ఇష్యూ గురువారం నాడు ముగిసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ అనుబంధ విభాగమే ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌. ఈ మధ్య కాలంలో ఐపీఓ ద్వారా మార్కెట్‌ నుంచి భారీగా నిధులు సేకరించిన కంపెనీల్లో ఒకటి. ఎస్‌బీఐ కార్డ్స్‌లో ప్రస్తుతం ఎస్‌బీఐకి 76 శాతం వాటా ఉంది. 


రూ.2 లక్షల కోట్ల విలువైన బిడ్లు!

సవాళ్ల సమయంలోనూ ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓకు మార్కెట్లో బ్లాక్‌బస్టర్‌ స్పందన లభించిందని విశ్వసనీయ వర్గాలన్నాయి. ఈ ఇష్యూ సైజుతో పోలిస్తే 26 రెట్లకుపైగా బిడ్లు వచ్చాయని, వాటి విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లని వారన్నారు. రూ.750-755 ధర శ్రేణితో వచ్చిన ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి రూ. 10,355 కోట్లు సమకూర్చుకోనుంది. 

Updated Date - 2020-03-06T06:22:33+05:30 IST