అప్రమత్తం

ABN , First Publish Date - 2020-11-26T05:09:54+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. రాష్ట్రంలో అధికంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాల్లో మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా కూడా ఉంది.

అప్రమత్తం
కాచవానిసింగారంలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌

  • రెండోదశ కరోనా నివారణకు జిల్లాయంత్రాంగం చర్యలు
  • గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్లో చైతన్యం
  • తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటు
  • లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచన


కరోనా కేసులు రోజూ నమోదవుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. మళ్లీ విజృంభించే అవకాశాలు న్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మేడ్చల్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. రాష్ట్రంలో అధికంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాల్లో మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా కూడా ఉంది. ఈనేపథ్యంలో జిల్లాయంత్రాంగం అప్రమత్తమై కరోనా నివారణకు తగిన చర్యలు చేపట్టింది. గతంలో జిల్లాలోని అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో రోజువారీగా 500పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెలరోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. అయితే మరోసారి కరోనా మహమ్మారి ప్రజలపై దాడి చేయనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఈ వైరస్‌ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించారు. రెండోదశ ప్రారంభమవుతోందని వైద్యులు ప్రకటించడంతో మరోసారి కరోనా గురించి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు పట్టణ, గ్రామీణప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ జిల్లాలోని 61గ్రామపంచాయతీల్లోని బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాల వద్ద పెద్దఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రజలంతా కూడా విధిగా మాస్కులు ధరించాలని, కరోనా లక్షణాలు ఉన్నవారిని తాకడం, చేతులు కలపడం వల్ల వైరస్‌ ఒకరినుంచి మరొకరికి సోకుతున్నందున అప్రమత్తంగా ఉండాలని, భౌతికదూరాన్ని పాటించాలని సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. విపరీతమైన జలుబు, తలనొప్పి, దగ్గు, మోకాళ్ల నొప్పులు, జ్వరం, పూర్తిగా నీరసించిపోవడం, అలసట, శ్వాస తీసుకోవడం కష్టతరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపించినట్లయితే వెం టనే వైద్యులను సంప్రదించాలని హోర్డింగులపై రాయించారు. మరోవైపు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నమోదైన బాధితులకు అవసరమైన మం దులు, పరీక్షలు, వైద్య నిపుణులతో ఉచితంగా సేవలు అందించేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, టీబీ, తదితర రోగాలు ఉన్నటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు. 


జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 47,330 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 36,072, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 9,323, గ్రామీణ ప్రాం తాల్లో 1,935 కేసులు నమోదయ్యాయి. ఇందులో 45,311 మంది డిశ్చార్జి అయ్యారు. వీరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 34,559మంది, మునిసిపాలిటీల్లో 8,868మంది, గ్రామీణంలో 1,884మంది ఉన్నారు. మొత్తం యాక్టివ్‌ కేసులు 1,921ఉండగా, వీటిలో అధికశాతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 98మంది మృతి చెందారు. 


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో కరోనా వైరస్‌ నివారణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టోంది. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా మహమ్మారిపై ప్రజలకు అవ గాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుం టున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. పల్లెలతోపాటు పట్టణా ల్లోనూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందరూ మాస్కులు ధరించాలి. 

- జాన్‌శ్యాంసన్‌, అదనపు కలెక్టర్‌ 


మాస్కులు ధరించి, శుభ్రత పాటించాలి

చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్‌ సోకదు. దగ్గినప్పుడు చేతిని అడ్డం పెట్టుకోవడం వల్ల ఈవ్యాధి వేరే వారికి సోకే అవకాశం తక్కు వగా ఉంటుంది. వైరస్‌బారిన పడకుండా మాస్క్‌లు విధిగా ధరించాలి. కరోనా వైరస్‌ గురించి ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందదు. వ్యాధి సోకిన వారి తుంపర్ల ద్వారానే వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బాధితులకు అవసరమైన మందులు, పరీక్షలు, వైద్య నిపుణుల సేవలన్నింటినీ ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

- డాక్టర్‌ వీరాంజనేయులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి 

Updated Date - 2020-11-26T05:09:54+05:30 IST