నగరంపై కరోనా కన్నెర్ర..!

ABN , First Publish Date - 2020-08-04T11:08:57+05:30 IST

కరోనా వైరస్‌ ఒంగోలు నగరాన్ని కమ్మేసింది. ఒక పాజిటివ్‌ కేసుతో నమోదైన నగరం ఇప్పుడు ఏకంగా 1100 ..

నగరంపై కరోనా కన్నెర్ర..!

‘డేంజర్‌’ జోన్‌లో ఒంగోలు 

కార్పొరేషన్‌ కార్యాలయానికి తాళాలు 

ప్రతి కాలనీలోనూ పాజిటివ్‌ కేసులు

 ఒంగోలులోనే 1100 దాటిన వైనం 


ఒంగోలు (కార్పొరేషన్‌) ఆగస్టు 3 : కరోనా వైరస్‌ ఒంగోలు నగరాన్ని కమ్మేసింది. ఒక పాజిటివ్‌ కేసుతో నమోదైన నగరం ఇప్పుడు ఏకంగా 1100 మందికి సోకింది. రోజూ వెలువడుతున్న బాధితుల సంఖ్య ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. ప్రస్తుతం ఒంగోలు డేంజర్‌ జోన్‌గా మారింది. ఏప్రిల్‌ 19న ఒంగోలు నగరంలో నమోదైన తొలి పాజిటివ్‌ కేసుతో నగరం ఉలిక్కిపడింది. అమ్మో కరోనా అంటూ అందరు వణికిపోయారు. స్థానిక జడ్పీ కాలనీలో అటు కిలోమీటరు, ఇటు కిలోమీటరు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. వైరస్‌ నిర్మూలనకు కార్పొరేషన్‌ అధికారులు బస్తాల కొద్దీ బ్లీచింగ్‌, లీటర్ల కొద్దీ సోడియం హైపో క్లోరైడ్‌ దావ్రణంతో ఇళ్లిల్లూ ముంచెత్తారు. ప్రజలెవరూ ఇల్లు దాటి రావద్దంటూ హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ వాతావరణం తలపించింది. 


ప్రస్తుత పరిస్థితి  ఇదీ..

ఉదయం 5గంటల నుంచే దుకాణాలన్నీ తెరుచుకుంటున్నాయి. టీ బంకుల నుంచి మెగా షాపింగ్‌ మాల్స్‌, మార్ట్‌లు సైతం షట్టర్లు ఎత్తేశాయి. దీంతో జన జీవనం రోడ్లపైకి చేరింది. ఏ దుకాణం చూసినా కొనుగోలుదారులతో నిండిపోగా, రోడ్లన్నీ రద్దీ వాతారణంతో ఉంటున్నాయి. వైన్‌షాపుల వద్ద మందు బాబుల క్యూ ఎన్నికల పోలింగ్‌ను తలపిస్తున్నది. ఒకే బైక్‌పై ఇద్దరు, ముగ్గురు రయ్‌ రయ్‌మంటూ దూసుకెళుతున్నారు. దీంతో పాజిటివ్‌ కేసులేని ప్రాంతం లేదంటే ఆశ్చర్యపకడ తప్పదు. నగరంలోని 50 డివిజన్లు ఉండగా, దాదాపుగా 45 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. అయితే ప్రకటనలే తప్ప అమలు తీరు గాలికొదిలేశారు. కట్టడి చర్యలు కఠినంగా లేకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 


పేరుకే కంటైన్‌మెంట్‌ జోన్‌లు

  కరోనా కట్టడికి నియంత్రణ చర్యలు మొక్కుబడిగా మారాయి. ప్రజల్లో చైతన్యం లేకపోవడం, మరోవైపు వ్యాపారుల ఒత్తిడితో దుకాణాల నిర్వహణకు ఒకపూట అనుమతి ఇవ్వడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పరిస్థితి ప్రమాదకర స్థితిలోకి వెళ్లింది.


కార్పొరేషన్‌ కార్యాలయానికి తాళాలు 

కరోనా కార్పొరేషన్‌ కార్యాలయాన్నీ తాకింది. కార్యాలయంలోని ఐదుగురు ఉద్యోగులకు పాజిటివ్‌ రావడంతో సోమవారం నుంచి పౌర సేవలను నిలిపివేశారు. కార్యాలయానికి తాళాలు వేశారు.    కమిషనరు, పలువురు అధికారులు, సెక్షన్‌ హెడ్‌లు స్వచ్ఛందంగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండగా, మిగిలిన ఉద్యోగులు సైతం కరోన భయంతో కార్యాలయానికి రాలేమంటూ శెలవులు పెట్టారు. 

Updated Date - 2020-08-04T11:08:57+05:30 IST